ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య
ABN , Publish Date - Apr 08 , 2026 | 02:36 PM
మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. దీంతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. అయితే ఈ ఓటమిపై ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా కొనసాగుతోంది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. దీంతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్-ఎంఐ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. విధ్వంసం సృష్టించింది. 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి ఏకంగా 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఎంఐ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆర్ఆర్‌పై 27 పరుగుల తేడాతో ఎంఐ ఓటమిపాలైంది. అయితే ఈ పరాజయంపై ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
‘రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దే. మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేమీ లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచే మాకు భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మేం బౌలింగ్‌లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ యూనిట్ మొత్తం విఫలమైంది. ఈ ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం. కనీసం ఐదు బంతులైనా సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు మేం పోరాడేందుకు అవకాశం లభించేది’ అని హార్దిక్ వెల్లడించాడు.
గొప్పగా ఆడారు..
‘రాజస్థాన్ రాయల్స్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే గేమ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు మేం ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కలేదు’ అని హార్దిక్ పాండ్య వివరించాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 11 ఓవర్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(77), వైభవ్ సూర్యవంశీ(39) విధ్వంసం సృష్టించారు. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే వైభవ్ రెండు సిక్సర్లు బాదేశాడు. 151 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై తేలిపోయింది. 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. సీనియర్ బౌలర్లు బుమ్రా, బౌల్ట్, శార్దూల్ ఠాకూర్, దీపర్ చాహర్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ విజయంతో రాజస్థాన్ హ్యాట్రిక్ గెలుపులు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య
ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు