టీమిండియా నేర్చుకోవాల్సింది చాలా ఉంది: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:11 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఒకానొక దశలో 77 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పేకమేడల్లా కుప్పకూలారు. ఒకానొక దశలో 77 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది. సూర్య 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు.
లక్ష్య ఛేదనలోనూ అమెరికా గట్టి పోటీనిచ్చింది. ఆఖరి వరకు విజయం కోసం పోరాడింది. కానీ సిరాజ్ 3 వికెట్ల ప్రదర్శనతో యూఎస్ఏ జట్టును కట్టడి చేశారు. దీంతో అమెరికా జట్టు 132 పరుగులే పరిమితమైంది. అయితే ఈ మ్యాచులో తడబాటుకు గురైన నేపథ్యంలో భారత్ మరింత మెరుగ్గా తన బ్యాటింగ్ ప్రణాళికలను రూపొందించుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) సూచించాడు.
‘నా దృష్టిలో 160 స్కోర్ చేయడం తేలికేమీ కాదు. టీమిండియా మంచి మార్జిన్‌తోనే గెలిచింది. అయితే భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ ఉంది. కానీ పవర్ ప్లేలో తేలిగ్గా వికెట్లు సమర్పించుకోవడం సమంజసం కాదు. 8 మంది బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగితే.. ముగ్గురు మాత్రమే బౌలర్లు ఉంటారు. 7-8 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోతే జట్టుకు పెద్ద సమస్య అవుతుంది. జట్టులో ఎనిమిది మంది బ్యాటర్లుంటే అందులో నలుగురి వికెట్లను పవర్‌ప్లేలోనే కోల్పోవడం కరెక్ట్ కాదు. అలా అయితే మనల్ని మనమే ఒత్తిడిలోకి నెట్టుకున్నట్లవుతుంది’ అని సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!
టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు