టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు శివరాత్రి.. పాకిస్థాన్‌కు కాళరాత్రి
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:04 PM
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆహా.. ఓహో.. ప్రేమదాస స్టేడియంలో మువ్వన్నెల రెపరెపలు చూస్తుంటే.. పండుగపూట ఒకింత ఉత్సాహం ఉరకలేస్తోంది. పాకిస్థాన్‌కు భారత్‌పై ఓటమి అలవాటే.. అయినప్పటికీ మళ్లీ మళ్లీ ఓడిపోవడం చూస్తుంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మనసులో మెదిలే మాటలే ఇవి. ఎన్నో డ్రామాలు.. మరెన్నో కవ్వింపులు.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనే ఆడబోమని కాసేపు.. టోర్నీలో ఆడుతాం కానీ భారత్‌తో ఆడబోమని మరి కాసేపు.. ఎట్టకేలకు వెనక్కి తగ్గి మైదానంలోకి దిగి.. పాక్ పరువు తీసుకుంది. కొలంబోలో భారత్ చేతిలో చిత్తు అయింది. దీంతో టీమిండియా నేరుగా సూపర్ 8కి దూసుకెళ్లింది.
అప్పుడు సచిన్ 98.. ఇప్పుడు ఇ‘షాన్‌దార్’ 77
తొలి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండా అభిషేక్ శర్మ(0) డకౌట్ అయ్యాడు. భారత అభిమానుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. వికెట్లు పడితేనేం ‘నేనున్నా’ అంటూ బ్యాట్‌ను బెంబేలెత్తించాడు ఇషాన్ కిషన్. 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాయంతో ఏకంగా 77 పరుగులు చేశాడు. శివరాత్రి రోజున పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రిస్కీ షాట్లు ఆడుతూ క్రీజులో ఉన్నంత సేపు బీభత్సం సృష్టించాడు. 2003 మార్చి 1.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్ తలపడ్డాయి. పాక్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగింది సచిన్ సేన. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సచిన్ 98 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి గెలిపించాడు. అయితే ఆరోజు కూడా శివరాత్రే కావడం విశేషం. నాడు సచిన్ నిలబడితే.. నేడు ఇషాన్ కిషన్ నిలబడ్డాడు.
‘మిస్టరీ’ స్పిన్నర్‌కే వణుకు పుట్టింది..
ఈ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ వైపే అందరి దృష్టి ఉంది. అతడి బౌలింగ్‌ను టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారోననే సందేహం ఉండేది. వచ్చీ రాగానే తొలి బంతికే సూర్యకుమార్(32) బౌండరీతో ఆహ్వానం పలికాడు. తారిక్ బౌలింగ్‌లో బ్యాటర్లు బాగానే పరుగులు రాబట్టారు. పాకిస్థాన్‌కున్న ఆ ఒక్క ఆశ కూడా నిరాశగా మారింది. అయితే తారిక్ బౌలింగ్‌లో సూర్య ఔట్ అవ్వడం ఒక్కటే అతడికి కాస్త ఊరటనిచ్చే విషయం.
చెలరేగిన భారత బౌలర్లు..
పాక్‌తో మ్యాచ్ అంటేనే ఒకింత కసి మొదలవుతుంది.. అది అభిమానుల్లో అయినా ఆటగాళ్లలోనైనా! మరి మైదానంలోకి దిగే ప్లేయర్లకు ఆ కసి తీర్చుకునే అవకాశం ఉంటుంది కదా.. అదే నిరూపించారు మన బౌలర్లు. పోటీ పడి మరీ వికెట్లు పడగొట్టారు. ఓవర్‌కో వికెట్ తీస్తున్నట్టుగా చెలరేగారు. హార్దిక్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరొక వికెట్ పడగొట్టి అదరహో అనిపించారు. మొత్తానికి పాక్ ఆటగాళ్ల పని పట్టారు.
కాగా టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఎనిమిదింట్లో విజయం సాధించి.. ఒక్కసారి ఓటమి పాలైంది. ఇప్పుడు పాక్ ఆటగాళ్లు అనుకుంటూ ఉంటారు.. వెనక్కి తగ్గి భారత్‌తో అనవసరంగా మ్యాచ్ ఆడటానికి ఒప్పుకున్నాం అని! భారత అభిమానులకు ఇది శివరాత్రి.. పాకిస్థాన్‌కు మాత్రం ఇది కాళరాత్రి!
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్