Share News

చేతులెత్తేసిన పాకిస్థాన్.. 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 10:18 PM

టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌లోనూ, తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

చేతులెత్తేసిన పాకిస్థాన్.. 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు..
India defeats Pakistan

టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌లోనూ, తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సూపర్-8కి క్వాలిఫై అయిపోయింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరిగింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ (44) ఒంటరి పోరాటం చేశాడు. (India vs Pakistan).


టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలించిన స్లో పిచ్‌పై ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు (Ishan Kishan performance). పది ఫోర్లు, మూడు సిక్స్‌లతో పరుగుల వరద పారించాడు. అయుబ్ బౌలింగ్‌లో ఇషాన్ అవుటైన తర్వాత పరుగుల వేగం కాస్త నెమ్మదించింది. ఆ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. సూర్య మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దూబె (27) వేగంగా ఆడాడు.


చివరకు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది (india won by 61 runs). 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో పాక్ ఏ దశలోనూ టార్గెట్‌ను ఛేదించేలా కనిపించలేదు. చివరకు పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అక్షర్, బుమ్రా, వరుణ్, హార్దిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్, కుల్దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా, టీ-20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం. పాక్ మాత్రం ఇప్పటికి ఒక్కసారే గెలుపొందింది.

Updated Date - Feb 15 , 2026 | 10:24 PM