భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:47 PM
పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(World Cup 2026)లో ఇప్పటికే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్, అమెరికా, స్కాట్లాండ్, జింబాబ్వే వంటి పలు జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించినంత పని చేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టును ఓడించి.. ఈ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఇలా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్2026లో క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడు అభిమానులను భయపెడుతున్నాడు.
శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్- పాక్(Ind vs Pak) మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, ఇవాళ కొలంబోలో వాన పడే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్ పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ (Basit Ali) విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.
ఓ స్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ..' దేవుడు.. నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’ అని బసిత్(Basit Ali) వ్యాఖ్యానించాడు. 'మీరు మ్యాచ్ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?' అని అక్కడే ఉన్న యాంకర్ అడుగగా.. 'నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను ' అని మరోసారి స్పష్టం చేశాడు. 2024 వరల్డ్‌కప్‌లో అనూహ్య రీతిలో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ తో పాటు అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది.
ఇక ఇప్పుడు టీమిండియా చేతిలో పాక్(Pakistan) భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్- పాక్ మ్యాచ్ వాన వల్ల చెడిపోవాలని బసిత్ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాగా వరల్డ్‌కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ మ్యాచ్.. ఇవాళ మధ్యాహ్నమే..
భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?