జువెలరీ షాపులో చోరీ.. గాడిదపై ఎక్కి పరార్.. వైరల్ వీడియో
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:21 PM
తుర్కియేకు చెందిన ఓ యువకుడు నగల షాపులో చోరీ చేసి గాడిదపై ఎక్కి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియేలో ఇటీవల అసాధారణ ఘటన వెలుగు చూసింది. బంగారం షాపులో చోరీకి తెగ బడ్డ యువకుడు గాడిదపై ఎక్కి పరారయ్యాడు (Turkey Jewelry Theft). ఫిబ్రవరి 9న ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది (Viral Video). నిందితుడిని తాజాగా అరెస్టు చేసిన పోలీసులు అతడు దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు (Thief Escapes Riding Donkey).
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తుర్కియేలోని కేసిరీ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. మెర్సెన్ ప్రాంతానికి వెళ్లేందుకు తాను ఆ రాత్రి బయటకు వెళ్లినట్టు నిందితుడు విచారణలో తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న తాను మొదట లిక్కర్ షాపు కోసం ఆ ప్రాంతంలో వెతికినట్టు తెలిపాడు. ఆ సమయంలో అక్కడ ఫోర్క్ లిఫ్ట్ కనిపిస్తే దాన్ని ఎక్కి కొంత దూరం వెళ్లి ఓ జువెలరీ షాపు ముందు ఆగినట్టు తెలిపాడు. అప్పుడు తనకు ఆర్థిక సమస్యలు గుర్తుకురావడంతో నగలను చోరీ చేసినట్టు తెలిపాడు. ఫోర్క్ లిఫ్ట్ సాయంతో షాపు షట్టర్‌ను ఎత్తి లోపలున్న నగలను తీసుకున్నట్టు తెలిపాడు. ఆ తరువాత షాపు వెనకవైపు ఉన్న గాడిదను ఎక్కి వెళ్లిపోయినట్టు వివరించాడు. వీడియోల్లో గాడిదపై కనిపించింది తానేనని అంగీకరించాడు.
నిందితుడు మొత్తం 150 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని గుర్తించినట్టు తెలిపారు. చోరీ తరువాత నేరుగా ఇంటికి వెళ్లిన అతడు ఇంటి పెరట్లో నగలను పాతిపెట్టాడని అన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చోరీ అయిన సొమ్ము మొత్తం రికవరీ చేసినట్టు వివరించారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలూ చదవండి:
శభాష్.. బామ్మా! వృద్ధురాలికి పోలీసుల సన్మానం! ఎందుకో తెలిస్తే..
కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు