కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు
ABN , Publish Date - Feb 13 , 2026 | 07:04 PM
తండ్రితో తనకు ఉన్న అనుబంధం గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. తండ్రి గుర్తొచ్చినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురవుతానని అన్నారు. ఒక రోజు ఇలాగే తండ్రి గుర్తొస్తే శ్మశానానికి వెళ్లి, అక్కడ కాలుతున్న చితి వద్దనున్న భస్మాన్ని ఒంటికి రాసుకుని కన్నీటిపర్యంతమైనట్టు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: విలక్షణ నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు సంజయ్ మిశ్రా (Sanjay Mishra). సాధారణంగా ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడరు. అయితే, తాజా పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తండ్రితో తనకున్న అనుబంధం గురించి చెప్పారు. ఆయన లేని వెలితిని తట్టుకోలేక ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి గురవుతానని అన్నారు.
‘ఆ రోజు అనుకోకుండా మా మామగారు ఇంటికి వచ్చారు. నేను అప్పుడు డ్రైవర్‌తో కలిసి మద్యం తాగుతున్నాను. అప్పుడు నాకు ఎందుకో మా నాన్న గుర్తొచ్చారు. వెంటనే నన్ను శ్మశానానికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాను. శ్మశానంలో మా నాన్న అంత్యక్రియలు జరిగిన చోటుకు వెళ్లి చూస్తే ఎవరిదో చితి కాలుతోంది. నేను అక్కడి నుంచి కొంత భస్మాన్ని తీసుకుని ఒళ్లంతా రాసుకున్నాను. నాన్నా.. అంటూ గట్టిగా అరిచాను. కానీ జనాలు అప్పుడు కూడా నాతో సెల్ఫీలు తీసుకున్నారు. నా ఒళ్లంతా చితాభస్మం ఉన్నా వాళ్లు లెక్క చేయలేదు. ఆ సమయంలో నేను తీవ్ర భావోద్వేగంలో ఉన్నాను. మా నాన్నను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యాను’ అని చెప్పుకొచ్చారు.
తాను చదువులో అంత చురుగ్గా ఉండేవాడిని కాదని సంజయ్ మిశ్రా తెలిపారు. దీంతో, తన భవిష్యత్తు గురించి తండ్రి నిత్యం బాధపడుతూ ఉండేవారని తెలిపారు. ‘కనీసం నేను పదవ క్లాసు పాసైతే నన్ను ప్రభుత్వ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగంలో వేయిస్తానని నాన్న అనే వారు’ అని సంజయ్ మిశ్రా చెప్పుకొచ్చారు. ‘నన్ను టైప్ నేర్చుకోమని నాన్న పట్టుబడుతుండేవారు. కనీసం అలా అయినా నాకు బతుకుతెరువు ఉంటుందని అనేవారు. ఆయన పోయిన ఇన్నేళ్లకు నేను టైప్ రైటర్ కొన్నాను. ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నాను’ అని భావోద్వేగానికి గురయ్యారు.
ఇవీ చదవండి:
యూట్యూబ్ ఛానల్ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో..
రౌడీ షీటర్‌తో మహిళా కానిస్టేబుల్ జంప్! ఆగిపోయిన పెళ్లి