Share News

యూట్యూబ్ ఛానల్‌ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో..

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:25 PM

తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాలేదని ఓ యువకుడు స్టూడియోకు నిప్పు పెట్టిన ఉదంతం ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. యువకుడిని అతడి కుటుంబం ప్రస్తుతం రాంచీ ఆసుపత్రిలో చేర్పించింది.

యూట్యూబ్ ఛానల్‌ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో..
Jharkhand Youtuber sets his studio on fire

ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూట్యూబ్ ఛానల్ కోసం ఆస్తులు అమ్మి స్టూడియో ఏర్పాటు చేసుకున్న ఒక యువకుడు చివరకు నిరాశతో దానికి నిప్పుపెట్టాడు. వ్యూస్ రాలేదనే కోపంలో అతడు చేసిన పనికి కుటుంబమూ ప్రాణాపాయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గర్వా జిల్లాలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విధాయక్ ప్రజాపతి అనే 27 ఏళ్ల యువకుడు కొంతకాలం క్రితం యూట్యూబ్ ఛానల్‌‌ను ప్రారంభించాడు. తన ఛానల్‌లో మంచి క్వాలిటీ కంటెంట్ కోసం ఖరీదైన కంప్యూటర్లు, లైట్లు, ఇతర వ్యవస్థలతో కూడిన ఓ స్టూడియోను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకోసం కుటుంబ ఆస్తిలో కొంత మొత్తాన్ని కూడా విక్రయించాడు. యూట్యూబ్ ఛానల్‌తో స్టార్ అయిపోదామని అనుకున్నాడు.


అయితే, అతడు తను ఆశించిన మేర వ్యూస్ రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. చివరకు ఫిబ్రవరి 7న తన స్టూడియోకు నిప్పు పెట్టడంతో స్టూడియో మొత్తం దగ్ధమైంది. ఖరీదైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులూ ప్రమాదంలో పడ్డారు. మంటలు చెలరేగుతున్న సమయంలో వారు ఇంట్లో ఓ ఇనుప తలుపు వెనకాల చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు పోలీసులను అలర్ట్ చేయడంతో వారు అగ్నిమాపక సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుటుంబసభ్యులను కూడా కాపాడారు. ఇక పోలీసులు వచ్చే సరికి కంగారుపడ్డ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజు అతడిని గుర్తించిన బంధువులు రాంచీలోని సైకియాట్రిక్ ఆసుపత్రికి తరలించారు.

విధాయక్ కష్టపడి పనిచేసే యువకుడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. కానీ తన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అతడు తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయాడని తెలిపారు. కొన్ని రోజులుగా అతడు తమతో కలివిడిగా ఉండటం కూడా తగ్గించేశాడని తెలిపారు. ఒంటరిగా ఉండేందుకు మొగ్గు చూపే వాడని అన్నారు.


ఇవీ చదవండి:

రౌడీ షీటర్‌తో మహిళా కానిస్టేబుల్ జంప్! ఆగిపోయిన పెళ్లి

లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్ల ఖర్చు! చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - Feb 13 , 2026 | 04:56 PM