లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్ల ఖర్చు! చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:54 PM
లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టినా పైసా గెలవక పోవడంతో ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. చైనాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. అసలు ఏం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టినా అదృష్టం కలిసిరాలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. చైనాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది (China Viral Lottery Case).
చైనా మీడియా కథనాల ప్రకారం, అన్షూయీ ప్రావిన్స్‌కు చెందిన హీ అనే వ్యక్తి ఎలాగైనా లాటరీ కొట్టాలన్న పంతంతో 2023లో పెద్ద ఎత్తున లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇన్ని టిక్కెట్లు కొంటే లాటరీ కచ్చితంగా తగులుతుందని బలంగా నమ్మాడు.
స్థానికంగా ఉన్న లాటరీ ఏజెంట్ ఝాంగ్ హీ తరఫున టిక్కెట్లను కొనుగోలు చేసి కంపెనీకి పంపించాడు. హీ పెడుతున్న ఖర్చుపై ఆందోళనతో అప్పుడప్పుడూ అతడిని ఝాంగ్ హెచ్చరించేవాడు. రిస్క్ వద్దని వారించే వాడు. కానీ హీ మాత్రం భారీ ఎత్తున లాటరీ టిక్కెట్లు కొన్నాడు. చివరకు పైసా కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చివరకు లాటరీ ఏజెంట్‌తో పాటు లాటరీ సంస్థపై కూడా కోర్టులో కేసు వేశాడు.
లాటరీ కంపెనీ ప్రచారాన్ని హోరెత్తించడంతో తాను తప్పుదారి పట్టి ఇంత డబ్బు పోగొట్టుకున్నానని కోర్టులో హీ వాదించాడు. కంపెనీ ప్రకటనలు, సోషల్ మీడియాలో యాడ్స్ అన్నీ తప్పుదారి పట్టించాయని చెప్పారు. అవన్నీ చట్టవ్యతిరేకమని అన్నారు. కాబట్టి, తన టిక్కెట్ కొనుగోళ్లను చెల్లనివిగా పరిగణించి డబ్బులు వాపసు ఇప్పించాలని అభ్యర్థించాడు. తనకు జరిగిన నష్టానికి కంపెనీనే బాధ్యత వహించాలని తేల్చి చెప్పాడు.
కానీ కోర్టు మాత్రం హీ వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. లాటరీతో వచ్చే రిస్క్ గురించి తేలిసే హీ డబ్బులు వెచ్చించాడని అభిప్రాయపడింది. టిక్కెట్ల కొనుగోలు సమయంలో ఝాంగ్ చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా పేర్కొంది. తన దురదృష్టానికి హీ ఎవరినీ నిందించకూడదంటూ తీర్పు వెలువరించింది.
ఈ వార్తలూ చదవండి:
భారతీయ కుటుంబానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన దుబాయ్ పాలకుడు
వీళ్లు మారేదెన్నడో.. వందే భారత్ రైల్లో మళ్లీ అదే సీన్