వీళ్లు మారేదెన్నడో.. వందే భారత్ రైల్లో మళ్లీ అదే సీన్
ABN , Publish Date - Feb 11 , 2026 | 08:25 PM
వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడు కనీస పౌర స్పృహ లేకుండా వ్యవహరించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను చూసిన జనాలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లు, రైల్వే స్టేషన్‌ల విషయంలో ప్రజలు బాధ్యతగా నడుచుకోకపోవడంతో అక్కడ నిత్యం అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంటుంది. అత్యాధునిక వందే భారత్ రైళ్లను కూడా కొందరు తమ పాత అలవాట్లతో అపరిశుభ్రంగా మార్చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి మరో ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది (Vande Bharat - Litter in Coach).
వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడు బోగీని అపరిశుభ్రంగా ఎలా మార్చాడో చెబుతూ మరో ప్రయాణికుడు వీడియో రికార్డు చేశారు. @nalanda_index అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘కొందరు మెరుగైన వసతులకు అసలేమాత్రం అర్హులు కారు. వందేభారత్ లాంటి రైళ్లల్లో కూడా వీళ్లు తమ పాత అలవాట్లను కొనసాగిస్తారు. చెత్త చేస్తారు. అత్యాధునిక రైల్లో కనీస పౌర స్పృహ లేని ప్రయాణికులను చూస్తుంటే చికాకుగా, విచారంగా ఉంటుంది’ అన్న కామెంట్‌తో ఈ వీడియోను షేర్ చేశారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ వ్యక్తి తను వాడిన పేపర్ ప్లేటు, గ్లాసులు, స్ట్రాలు వంటివాటిని సీటు కింద పెట్టుకున్నాడు. ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది ఆ ప్రయాణికుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అలాంటి వాళ్లం కాదని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని కొందరు అన్నారు. ఇలాంటి వారి ముఖాలు కనిపించేలా రికార్డు చేసిన వీడియోలను నెట్టింట పంచుకుంటే కానీ బాధ్యులకు బుద్ధి రాదని కొందరు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
అప్పటి వరకూ పాడేదే లేదు.. స్టేజ్‌పై ప్రముఖ గాయని అల్టిమేటమ్
ఏంటీ..!? ఎయిర్‌పోర్టులో టీ రూ.10, సమోసా రూ.20.. జనాలు షాక్