అప్పటి వరకూ పాడేదే లేదు.. స్టేజ్‌పై ప్రముఖ గాయని అల్టిమేటమ్
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:20 PM
సంగీత కార్యక్రమంలో పాల్గొన్న దురంధర్ మూవీ గాయని జాస్మిన్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు ఆమె అండగా నిలిచిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: దురంధర్ సినిమాలో పాడిన ప్రముఖ పంజాబీ గాయని జాస్మిన్ సండ్లాస్ (Jasmine Sandlas Concert) పేరు మారుమోగిపోతోంది. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు (Women Harassed) ఆమె అండగా నిలిచిన వైనం వైరల్‌గా మారింది. ఇటీవల ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సంగీత కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది (Viral Video).
అభిమానుల కోలాహలం నడుమ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తన పాటలతో అలరించేందుకు జాస్మిన్ సండ్లాస్ స్టేజ్‌పై వచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె పల్లకీలో కూర్చుని స్టేజ్‌పైకి వచ్చారు. ఆ తరువాత ఆమె పాట పాడుతుండగా ఇద్దరు మహిళలు వేధింపులకు గురవుతున్న వైనం ఆమె కంటపడింది. దీంతో, వెంటనే ఆమె పాటను ఆపేశారు.
‘సెక్యూరిటీ.. ఆ ఇద్దరు పురుషులను వెంటనే బయటకు పంపించేయండి. వాళ్లు మహిళలను వేధిస్తున్నారు’ అని జాస్మిన్ భద్రతా సిబ్బందికి చెప్పారు. ఆ ఇద్దరు మహిళలు మళ్లీ భద్రంగా ఫీల్ అయ్యే వరకూ నేను పాట పాడేది లేదు అని ప్రేక్షకుల వైపు తిరిగి తేల్చి చెప్పారు. దీంతో, ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలతో ఆమె నిర్ణయానికి మద్దతు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల మేఘాలయలో గాయని కనికా కపూర్ పాల్గొన్న సంగీత కార్యక్రమంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆమె ఆలపిస్తుండగా ఓ వ్యక్తి స్టేజ్‌పైకి ఎక్కి ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన వైరల్ కావడంతో కార్యక్రమం నిర్వాహకులపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.