ఏంటీ..!? ఎయిర్‌పోర్టులో టీ రూ.10, సమోసా రూ.20.. జనాలు షాక్
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:36 PM
పుణె అంతర్జాతీయ విమానాశ్రయంలో టీ కేవలం రూ.10లకే లభిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టుల్లో తినుబండారాల ధరలు ఏ స్థాయిలో ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికాదాయ వర్గాలు కూడా అక్కడి స్టాల్స్‌లో ఫుడ్ కొనేందుకు జంకుతాయి. అయితే, పుణె అంతర్జాతీయ విమానాశ్రయంలోని (Pune Aiport) ఓ ఫుడ్ స్టాల్‌లో మాత్రం ఆహార పదార్థాలు అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి (Tea, Samosa Low Prices). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral Video) అవుతూ జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
పుణె ఎయిర్‌పోర్టులోని ఉడాన్ యాత్రీ కేఫ్‌కు సంబంధించిన వీడియో ఇది. అక్కడి టీ కేవలం రూ.10లకు, ఒక సమోసా రూ.20లకు లభిస్తున్నాయని పీయూష్ త్రిపాఠీ, ఆయన భార్య ఆశ్చర్యపోతూ తెలిపారు. వీడియోను కూడా షేర్ చేశారు. సమోసా తింటావా? అని తొలుత పీయూష్ అడిగితే ఆయన భార్య తిందామని అన్నారు. దీంతో పీయూష్ ఆమెను ఉడాన్ స్టాల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రూ.10లకు టీ, రూ.20కి సమోసా లభించడంతో వారికీ ఆశ్చర్యం వేసింది. దీనికి కారణం రాజ్యసభ ఎంపీ రాఘవ్ ఛద్దా అని కూడా ఆమె చెప్పారు. ఎయిర్‌పోర్టుల్లో ధరలపై జనాల్లో అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితి మధ్య అంతరం ఇదీ అంటూ ఆ జంట వీడియోను షేర్ చేశారు.
ఇక వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏకంగా 9.9 మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి. మధ్యతరగతి ప్రజలకు విమానప్రయాణలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఎయిర్‌పోర్టుల్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్న వైనాన్ని ఎంపీ రాఘవ్ ఛద్దా 2024లో పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయల్లో తక్కువ ధరలకు ఫుడ్ అందుబాటులో ఉంచేందుకు ఉడాన్ యాత్రీ కేఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ఈ వార్తలూ చదవండి!
మహిళా రిపోర్టర్‌కు టీనేజర్ల వేధింపులు! వీడియో వైరల్
భారతీయ స్నేహాల్ని తక్కువ అంచనా వేయొద్దు: జర్మనీ యువతి