Share News

మహిళా రిపోర్టర్‌కు టీనేజర్ల వేధింపులు! వీడియో వైరల్

ABN , Publish Date - Feb 10 , 2026 | 10:33 PM

విద్యార్థులను ఇంటర్వ్యూ చేసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చిన ఓ మహిళా రిపోర్టర్‌ను అక్కడి టీనేజ్ బాలురు ఇబ్బంది పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీనేజర్ల ప్రవర్తన చూసి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా రిపోర్టర్‌కు టీనేజర్ల వేధింపులు! వీడియో వైరల్
Bihar exam centre viral video

ఇంటర్నెట్ డెస్క్: వాళ్లు 12వ తరగతి చదువుతున్న బాలురు. పరీక్ష రాయడానికి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చారు. అయితే, పుస్తకాల్లోని పాఠాలు నేర్చుకునే ఈ టీనేజర్లు సంస్కారం మాత్రం నేర్వలేదనేందుకు నిదర్శనంగా ఓ మహిళా జర్నలిస్టుతో ఇష్టారీతిన వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. బాలుర తీరుతో విసిగిపోయిన విలేకరి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు (Female Reporter Harrassed). వీళ్లు రేపు పోలీసులై దేశాన్ని ఉద్ధరిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Bihar Exam Center Video)

బిహార్‌లో ఓ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఉదంతం చోటుచేసుకుంది. పరీక్షలపై విద్యార్థుల స్పందన తెలుసుకునేందుకు ఆ రిపోర్టర్ అక్కడికి వెళ్లారు. అక్కడి స్టూడెంట్స్‌ కొందరిని ఆమె ప్రశ్నిస్తుండగానే ఇతర బాలురు ఆమెను చుట్టుమట్టారు. ఒకరినొకరు తోసుకుంటూ ఆమెనూ నెట్టేశారు. కనీసం సంస్కారమన్నదే లేకుండా రిపోర్టర్‌ను ఇబ్బంది పెట్టారు.


విద్యార్థుల తీరుతో విసిగిపోయిన మహిళా విలేకరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వీళ్లు పోలీసు ఉద్యోగాలు వెలగబెడతారా? అని మండిపడ్డారు. ‘ఇదేం పద్ధతి? కనీస మర్యాద లేదా? మీలాంటి వారి వల్లే బిహార్ పరువుపోతోంది’ అని అన్నారు. వీళ్లంతా పిల్లలా!! రాష్ట్ర భవిష్యత్తు రూపకర్తలా! మా లాంటి వాళ్లు పరీక్ష కేంద్రానికి వస్తే అసభ్యకరంగా తాకేందుకు ట్రై చేస్తారు. కనీసం సంస్కారం లేని ఇలాంటి వాళ్లు రాజకీయాలు, కుల వివక్ష గురించి మాట్లాడుతారు’ అని రిపోర్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇక వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేటి యువతలో చాలా మంది కనీసం సంస్కారం లేని వారిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వీళ్లల్లో ఒక్కరు కూడా మంచిమర్యాద నేర్చుకున్నట్టు లేదు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 10:43 PM