సన్‌రైజర్స్ చిత్తు.. గెలుపు రహస్యాన్ని చెప్పేసిన గుజరాత్ కెప్టెన్ గిల్
ABN , Publish Date - May 13 , 2026 | 07:37 AM
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 168 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కానీ ఛేదనలో జీటీ బౌలర్లు అద్భుతం చేశారు. సిరాజ్, రబాడా, హోల్డర్ విజృంభించిన వేళ.. 86 పరుగులకే సన్‌రైజర్స్ కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం జట్టు విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడాడు.
‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్‌ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్‌పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్‌ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తున్నాడు’ అని గిల్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా