నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ABN , Publish Date - May 12 , 2026 | 02:36 PM
జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై డబ్ల్యూఎఫ్ఐ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే.. పోటీలో పాల్గొనేందుకు వినేశ్ యూపీలోని గొండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఆమెపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే.. పోటీలో పాల్గొనేందుకు వినేశ్ గొండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం వినేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా ఉండాలనేదే డబ్ల్యూఎఫ్ఐ లక్ష్యమని ఆమె ఆరోపించారు. తాను మళ్లీ పతకాలు గెలుస్తానని వారు భయపడుతున్నారని విమర్శించారు.
‘2024 పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన తర్వాత నా జీవితంలోనే ఆనందాన్ని కోల్పోయాను. కానీ నా కుమారుడు క్రిధవ్ తిరిగి నాలో ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. వ్యవస్థపై పోరాడే శక్తి నా కొడుకు వల్లే వచ్చింది. నాపై అనర్హత వేటు వేసినట్టు శుక్రవారం రాత్రి నోటీసు అందింది. దానికి సమాధానం ఇచ్చేందుకు 14 రోజుల గడువు ఇచ్చారు. ఇదే విషయాన్ని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌కు తెలిపాను. సమయం లేకపోవడం వల్ల ఆ నోటీసులకు క్లుప్తంగానే సమాధానం ఇచ్చాను. తొలుత నన్ను పోటీ చేయడానికి అనుమతి ఇవ్వమని సంజయ్ సింగ్‌ను కోరాను. 14 రోజుల తర్వాత నా సమాధానంతో సంతృప్తి చెందకపోతే చర్యలు తీసుకోమని చెప్పాను. కానీ సంజయ్ సింగ్ దానికి అంగీకరించలేదు. నేను మళ్లీ పతకాలు గెలుస్తానని డబ్ల్యూఎఫ్ఐ భయపడుతోంది. ప్రాథమికంగా నన్ను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా ఆపాలని చూస్తోంది. స్వయంగా నేనే రిటైర్ అవ్వాలని కోరుకుంటోంది’ అని వినేశ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్