ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
ABN , Publish Date - May 11 , 2026 | 03:27 PM
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా బీసీసీఐ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అహ్మదాబాద్ స్టేడియానికి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో మరో 16 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇటీవల బీసీసీఐ ఈ సీజన్‌కు సంబంధించిన ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్ పోరుకు కేటాయించడంతో క్రికెట్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఐపీఎల్ విజేత జట్టు తదుపరి సీజన్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చే ఆనవాయితీ ఉంది. దాని ప్రకారం, ఈ సీజన్ ఫైనల్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాలి. కానీ బీసీసీఐ బెంగళూరును కాదని అహ్మదాబాద్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే గత ఐదేళ్లలో నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది నాలుగోసారి. దీంతో అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
2022, 2023, 2025, 2026.. గత ఐదేళ్లలో నాలుగుసార్లు అహ్మదాబాద్ స్టేడియం ఐపీఎల్ ఫైనల్‌కు వేదికైంది. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. దీంతో 2025 ఫైనల్‌కు కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదిక కావాల్సి ఉంది. అయితే అక్కడ వర్షం పడే సూచనలు ఉన్నాయనే కారణాలు చూపుతూ అనూహ్యంగా కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు బీసీసీఐ ఫైనల్ వేదికను మార్చింది. బీసీసీఐ నిర్ణయం అప్పుడు కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆసక్తికరంగా ఫైనల్ మ్యాచ్ రోజు కోల్‌కతాలో వర్షం పడలేదు. దీంతో ఆ అంశం మరింత చర్చనీయాంశమైంది.
అందుకే బెంగళూరుకు నో..!
ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఉండాల్సింది. బెంగళూరుకు ఫైనల్ ఇవ్వకపోవడానికి టికెట్ల వివాదమే కారణమని బీసీసీఐ స్పష్టం చేసింది. కర్ణాటక రాష్ట్ర రాజకీయ నాయకులు భారీగా ఉచిత టికెట్లు కోరడం, ఇప్పటికే ఉన్న కోటాతో కలిపి సాధారణ అభిమానులకు టికెట్లు తగ్గిపోవడం బోర్డును అసహనానికి గురి చేసింది. దీంతో బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
అదే ప్రధాన కారణం..
ఇక అహ్మదాబాద్‌కు వరుసగా ఫైనల్ వేదికను కేటాయించడానికి ప్రధాన కారణాల్లో స్టేడియం సామర్థ్యం కూడా ఒకటి. లక్షకు పైగా ప్రేక్షకులు కూర్చొనే సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా దీనికి పేరుంది. ఈ వేదికలో భారీ సంఖ్యలో టికెట్లు విక్రయించొచ్చు. టీవీ ప్రసారాల్లో కూడా ఈ స్టేడియం మరింత గ్రాండ్‌గా కనిపిస్తుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అభిమానులు మాత్రం బీసీసీఐ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాంఖడే, చిన్నస్వామి, ఈడెన్ గార్డెన్స్ వంటి చారిత్రక స్టేడియాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతి నగరానికి ఐపీఎల్ ఫైనల్ ఆతిథ్యం దక్కాలని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సూర్యకుమార్ నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందా?
ఆర్సీబీ కోచ్‌పై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?