Share News

రెండు జట్లు ఔట్.. మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ లెక్కలివే.!

ABN , Publish Date - May 11 , 2026 | 01:10 PM

ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మిగతా ఎనిమిది జట్లు టాప్‌-4లో నిలిచి ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీగా తలపడనున్నాయి.

రెండు జట్లు ఔట్.. మిగిలిన జట్ల ప్లేఆఫ్స్ లెక్కలివే.!
IPL 2026 playoffs

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ చివరి బంతికి గెలిచింది. అలానే మరో మ్యాచ్‌లో లఖ్‌నవూపై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితంతో ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లేఆఫ్ రేసు నిష్క్రమించాయి. మిగిలిన ఎనిమిది జట్లు టాప్‌-4లో నిలిచి ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీగా తలపడనున్నాయి. 8 జట్ల ప్లేఆఫ్స్‌ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 14 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ బెర్తు దాదాఫు ఖాయమైనట్లే. ఒకవేళ ఆర్సీబీ మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది.

సన్‌ రైజర్స్ హైదరాబాద్:

ఎస్ఆర్‌హెచ్ కూడా బెంగళూరు మాదిరిగానే 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది. కానీ, నెట్‌ రన్‌రేట్ (+0.737) తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జట్టు తమ చివరి 3 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిస్తే.. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. మే 22న ఆర్సీబీతో జరిగే ఆరెంజ్ ఆర్మీ చివరి లీగ్ మ్యాచ్ ఫలితంతో క్వాలిఫయర్-1 స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో తేలిపోనుంది.


గుజరాత్ టైటాన్స్:

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జీటీ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీ, సన్‌రైజర్స్‌తో పోలిస్తే గుజరాత్ నెట్‌ రన్‌రేట్(+0.228) తక్కువగా ఉంది. గుజరాత్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించాలి. మే 12న గుజరాత్, హైదరాబాద్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఇరు జట్లకు నిర్ణయాత్మకం కానుంది.

పంజాబ్ కింగ్స్‌:

ఇప్పటివరకు మిగిలిన జట్లతో పోలిస్తే పంజాబ్ ఒక మ్యాచ్ తక్కువ ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన పీబీకేఎస్ 13 పాయింట్లతో ఉంది. చివరి 4 మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే ఆ జట్టు 17 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, లఖ్‌నవూలతో పంజాబ్ తలపడనుంది.


చెన్నై సూపర్ కింగ్స్:

5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు చివరి 3 మ్యాచ్‌ల్లో రెండింట గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. కానీ, నెట్‌ రన్‌రేట్(+0.185) తక్కువగా ఉండటం సీఎస్కేను టెన్షన్ పెడుతోంది. చెన్నై టీమ్ నేరుగా అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్‌:

12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్.. సీఎస్కేతో సమానంగా ఉంది. రాజస్థాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌ అవకాశాలుంటాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమిపాలవడంతో ఆర్ఆర్ నెట్‌ రన్‌రేట్(+0.082) పడిపోయింది. మొత్తంగా నాలుగో స్థానం కోసం సీఎస్కేతో రాజస్థాన్ జట్టు పోటీపడొచ్చు.


కోల్‌కతా నైట్ రైడర్స్:

కేకేఆర్ ప్లేఆఫ్స్‌ చేరేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 9 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు 17 పాయింట్ల మార్కును చేరుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్:

11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన ఢిల్లీ సాంకేతికంగా మాత్రమే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. ఈ జట్టు 14 పాయింట్లకు చేరుకోవడానికి మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలపైనా ఆధారపడాల్సి ఉంటుంది. ఆ ఫలితాలు అనుకూలంగా వస్తేనే డీసీప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌ నిర్ణయమే ముంబై ఇండియన్స్ కొంపముంచిందా?

ఆర్సీబీ కోచ్‌పై బీసీసీఐ సీరియస్.. ఎందుకంటే?

Updated Date - May 11 , 2026 | 02:10 PM