Share News

టైటాన్స్‌ టాప్‌షో

ABN , Publish Date - May 13 , 2026 | 01:58 AM

పటిష్ఠ ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ అదరగొడుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట నిలిచింది. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు అదరగొట్టిన వేళ..

టైటాన్స్‌ టాప్‌షో

నేటి మ్యాచ్‌

బెంగళూరు X కోల్‌కతా

వేదిక : రాయ్‌పూర్‌, రా.7.30

సుదర్శన్‌, సుందర్‌ అర్ధ సెంచరీలు

82 రన్స్‌ తేడాతో సన్‌రైజర్స్‌ చిత్తు

వణికించిన పేసర్లు రబాడ, హోల్డర్‌

అహ్మదాబాద్‌: పటిష్ఠ ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ అదరగొడుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట నిలిచింది. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు అదరగొట్టిన వేళ.. 82 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. గిల్‌సేనకిది వరుసగా ఐదో విజయం కాగా.. మొత్తం 16 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అటు భారీ స్కోర్లతో బెంబేలెత్తించే రైజర్స్‌ కనీసం వంద పరుగులు కూడా చేయలేక చతికిలపడింది. ఇక రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61), సుందర్‌ (33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) హాఫ్‌ సెంచరీలు సాధించారు. పేసర్లు ప్రఫుల్‌, సకీబ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 14.5 ఓవర్లలో 86 పరుగులకు కుప్పకూలింది. కమిన్స్‌ (19) టాప్‌ స్కోరర్‌. పేసర్లు హోల్డర్‌, రబాడలకు మూడేసి, ప్రసిద్ధ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రబాడ నిలిచాడు.

రైజర్స్‌ తడ‘బ్యాటు’: ఓ మాదిరి ఛేదనే అయినప్పటికీ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. పిచ్‌ బౌలర్లకు మరింతగా సహకరించడంతో భీకర బ్యాటింగ్‌ ఆర్డర్‌ కలిగిన రైజర్స్‌ను గుజరాత్‌ బౌలర్లు వణికించారు. తొలి ఓవర్‌ మెయిడిన్‌గా వేసిన పేసర్‌ సిరాజ్‌ ఓపెనర్‌ హెడ్‌ (0)ను అవుట్‌ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ అభిషేక్‌ (6)ను రబాడ బౌల్డ్‌ చేయడంతో రైజర్స్‌ షాక్‌కు గురైంది. ఆ తర్వాత కూడా వరుస ఓవర్లలో ఇషాన్‌ కిషన్‌ (11), స్మరణ్‌ (9)లను రబాడ అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 34/4 స్కోరుతో ఓటమి దిశగా సాగింది. సలీల్‌ అరోరా, క్లాసెన్‌ల మధ్య ఐదో వికెట్‌కు వచ్చిన 24 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం గమనార్హం. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు రైజర్స్‌ పోటీలో ఉన్నట్టు కనిపించింది. కానీ హోల్డర్‌ 11వ ఓవర్‌లో క్లాసెన్‌, నితీశ్‌ (2) ఇద్దరినీ అవుట్‌ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో కమిన్స్‌ కాసేపు క్రీజులో నిలువగలిగాడు.


సుదర్శన్‌-సుందర్‌ నిలకడ

పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకున్న సన్‌రైజర్స్‌ బౌలర్లు చెలరేగారు. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ పవర్‌ప్లేలో చేసింది 34 పరుగులే కాగా, కెప్టెన్‌ గిల్‌ (5), బట్లర్‌ (7) వికెట్లను సైతం కోల్పోయింది. కానీ మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ పట్టు వదల్లేదు. నిషాంత్‌ సింధు (22) ఉన్నకాసేపు ఎదురుదాడికి దిగాడు. అయితే పదో ఓవర్‌లో పేసర్‌ కమిన్స్‌ అతడిని అవుట్‌ చేశాడు. 64/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన జట్టును సాయితో కలిసి వాషింగ్టన్‌ సుందర్‌ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ జోడీ రైజర్స్‌ బౌలర్లను నిలకడగా ఎదుర్కొంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరును గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. అలాగే 38 బంతుల్లో సాయి సీజన్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్‌లో సాయిని పేసర్‌ సకీబ్‌ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 19వ ఓవర్‌లో సుందర్‌ చెలరేగి 4,4,6తో 18 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 150 దాటింది. చివరి ఓవర్‌లో అర్ధసెంచరీ చేశాక ఐదో బంతికి సుందర్‌ అవుటయ్యాడు. హోల్డర్‌ (11 నాటౌట్‌)తో కలిసి తను ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. ఆఖరి బంతిని తెవాటియా (4 నాటౌట్‌) ఫోర్‌గా మలచడంతో జీటీ 160+తో సవాల్‌ విసిరే స్కోరందుకుంది.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) ప్రఫుల్‌ (బి) సకీబ్‌ 61, గిల్‌ (సి) క్లాసెన్‌ (బి) ప్రఫుల్‌ 5, బట్లర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్రఫుల్‌ 7, నిశాంత్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 22, సుందర్‌ (సి) ఇషాన్‌ (బి) సకీబ్‌ 50; హోల్డర్‌ (నాటౌట్‌) 11; తెవాటియా (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 168/5; వికెట్ల పతనం: 1-15, 2-26, 3-64, 4-124, 5-164; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-20-1, నితీశ్‌ 3-0-27-0, ప్రఫుల్‌ 3-0-17-2, ఎషాన్‌ 4-0-46-0, సకీబ్‌ 4-0-37-2, శివంగ్‌ 2-0-19-0.


సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) నిషాంత్‌ (బి) సిరాజ్‌ 0, అభిషేక్‌ (బి) రబాడ 6, ఇషాన్‌ (సి) బట్లర్‌ (బి) రబాడ 11, స్మరణ్‌ (సి) గిల్‌ (బి) రబాడ 9, క్లాసెన్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 14, సలీల్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 16, నితీశ్‌ (సి) సుందర్‌ (బి) హోల్డర్‌ 2, కమిన్స్‌ (సి) సిరాజ్‌ (బి) ప్రసిద్ధ్‌ 19, శివంగ్‌ (సి) బట్లర్‌ (బి) హోల్డర్‌ 4, ప్రఫుల్‌ (స్టంప్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 3, ఎషాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 14.5 ఓవర్లలో 86 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-6, 3-23, 4-32, 5-56, 6-56, 7-60, 8-72, 9-82, 10-86; బౌలింగ్‌: సిరాజ్‌ 3-1-11-1, రబాడ 4-0-28-3, హోల్డర్‌ 4-0-20-3, ప్రసిద్ధ్‌ 3-0-23-2, రషీద్‌ 0.5-0-3-1.

1

ఐపీఎల్‌లో తమ అత్యల్ప స్కోరు (86)ను నమోదు చేసిన సన్‌రైజర్స్‌. అలాగే భారీ తేడా (82)తో ఓడడం కూడా ఇదేమొదటిసారి.

1

వరుసగా మూడో ఏడాదీ 500+ పరుగులు పూర్తి చేసిన సాయి సుదర్శన్‌. గతంలో గేల్‌, ధవన్‌, విరాట్‌ కూడా ఇన్నేసార్లు ఈ ఫీట్‌ సాధించారు. వార్నర్‌ (6 సార్లు), కేఎల్‌ రాహుల్‌ (5 సార్లు) టాప్‌-2లో ఉన్నారు.

1-Sports.jpg

ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 13 , 2026 | 01:58 AM