వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:32 PM
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై రోహిత్ అభిమానులతో పాటు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై రోహిత్ అభిమానులతో పాటు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా నిరాశ వ్యక్తం చేశాడు. అయితే రోహిత్ శర్మ సెంచరీ మిస్ కావడంపై గావస్కర్ చెప్పిన కారణం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
‘రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయానికి.. అతడి వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 వన్డే సెంచరీలు ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ముగిసే సమయానికి రోహిత్ వయసు 40 ఏళ్లు. దీంతో అప్పటికి అతడి వన్డే సెంచరీల సంఖ్య 40కి చేరుకోవాలి. రోహిత్ 92 పరుగుల వద్ద ఔటవ్వడం నన్ను నిరాశపరిచింది. కారణం అతడు సెంచరీ చేయలేకపోవడమే. 2027 ప్రపంచకప్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అప్పటికి అతడి వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఉంటే 36వ శతకం పూర్తయ్యేది. ఆ లక్ష్యానికి మరింత చేరువయ్యేవాడు’ అని గావస్కర్ వెల్లడించాడు.
నా విషయంలోనూ ఇదే జరిగింది..
‘రిటైర్‌మెంట్ సమయానికి ఆటగాడి వయసు కంటే అతడి సెంచరీలు ఎక్కువగా ఉంటే.. అది అతడి కెరీర్ స్థాయిని, ఇన్నేళ్లుగా కొనసాగించిన ప్రమాణాలను తెలియజేస్తుంది. నా కెరీర్ చివరి దశలో కూడా ఇదే లక్ష్యంతో ఆడాను. నా అంతర్జాతీయ కెరీర్ చివరి ఏడాదిలో నా వయసుకు సమానంగా టెస్టు సెంచరీలు చేయాలని అనుకున్నా. కానీ మూడుసార్లు 90ల్లో ఔటయ్యాను. ఆ మూడు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి ఉంటే.. నేను రిటైరైన 38 ఏళ్ల వయసుకు సమానంగా నా సెంచరీలు ఉండేవి’ అని గావస్కర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..