Share News

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:09 PM

ఫుట్‌బాల్‌ను ఓ పిచ్చిగా ఆరాధించే 'సిటీ ఆఫ్ జాయ్' కోల్‌కతా నగరంలో పసుపు జెర్సీల సందడి మొదలైంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడంతో నగరం అంతటా ఫుట్‌బాల్ ఫీవర్ కమ్మేసింది.

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
India Brazil Football Match

కోల్‌కతా, అక్టోబర్ 03: ఫుట్‌బాల్‌ను ఓ పిచ్చిగా ఆరాధించే 'సిటీ ఆఫ్ జాయ్' కోల్‌కతా నగరంలో పసుపు జెర్సీల సందడి మొదలైంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడంతో నగరం అంతటా ఫుట్‌బాల్ ఫీవర్ కమ్మేసింది. వినీషియస్ జూనియర్, ఎండ్రిక్, మార్కిన్హోస్, బ్రూనో గుమారేస్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు దిగ్గజ కోచ్ కార్లో అంసెలోట్టి రాకతో సాల్ట్ లేక్ స్టేడియం పరిసరాలు కోలాహలంగా మారాయి.


ఒకవైపు దసరా (దుర్గాపూజ) వేడుకల పందిళ్లు, కాంతుల వెలుగులతో నగర వీధులు కళకళలాడుతుండగా.. మరోవైపు బ్రెజిల్, భారత్ జెర్సీల విక్రయాలతో మైదాన్ మార్కెట్లు బిజీగా మారాయి. పీలే, రొనాల్డో, నెయ్‌మార్‌లతో మొదలైన కోల్‌కతా వాసుల బ్రెజిల్ ప్రేమ, ఇప్పుడు తమ కళ్ల ముందే ప్రత్యక్షంగా ఆడే స్టార్ ఆటగాళ్లను చూసి మరింత మురిసిపోతోంది. ఈ మెగా పోరు కోసం పోలీసులు ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో పాటు 20 మంది ఐపీఎస్ అధికారులను సాల్ట్ లేక్ స్టేడియం వద్ద మోహరించారు.


భారత్‌కు కఠిన పరీక్ష:

ఇటీవల బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో పనామా జట్టును 1-1తో నిరోధించిన భారత జట్టు, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగుతోంది. హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ మాట్లాడుతూ.. బ్రెజిల్ వంటి బలమైన జట్టుతో తలపడేటప్పుడు డిఫెన్స్ చాలా బలంగా ఉండాలని, పరిస్థితిని బట్టి దాడికి దిగుతామని స్పష్టం చేశారు. అలాగే డిఫెండర్ అన్వర్ అలీ మాట్లాడుతూ.. పనామా మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెట్టి, ప్రపంచ స్థాయి జట్టుపై 100 శాతం ప్రదర్శన ఇస్తామని తెలిపారు.


మన ప్రదర్శనను పరిశీలించిన అంసెలోట్టి:

మరోవైపు బ్రెజిల్ కోచ్ కార్లో అంసెలోట్టి భారత జట్టు ఆటతీరును తేలిగ్గా తీసుకోలేదు. 'భారత్-పనామా మ్యాచ్‌ను పరిశీలించాం. భారత స్ట్రైకర్ ర్యాన్ విలియమ్స్ ప్రమాదకరమైన ఆటగాడు, అతనితో మాకు ముప్పు ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను మేము ఒక సాధారణ ప్రదర్శనగా కాకుండా ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. తమ బ్రెజిలియన్ శైలి అయిన ఆనందం, ఉత్సాహంతో ఆడి అభిమానులను అలరిస్తామని తెలిపారు. బ్రెజిల్ జట్టును నేరుగా చూడాలనే దశాబ్దాల కోరిక నెరవేరుతుండటంతో సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్-బ్రెజిల్ మధ్య జరిగే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ కోసం క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలకు ఘనమైన ముగింపు.. భారత్‌కు 85 పతకాలు..

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్

Updated Date - Oct 03 , 2026 | 07:09 PM