Share News

పతకాల పండగ

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:16 AM

సియా క్రీడల్లో దాదాపు పోటీలన్నీ ముగిశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. స్టార్‌ ఆటగాళ్లతో కూడిన క్రికెట్‌, హాకీ పురుషుల జట్లు అద్భుత ఆటతో జపాన్‌లో భారత క్రీడాభిమానులను అలరించాయి....

పతకాల పండగ

క్రికెట్‌, హాకీ, ఆర్చరీ, రెజ్లింగ్‌, గోల్ఫ్‌లో అదుర్స్‌

హాకీ జట్టుకు ఒలింపిక్‌ బెర్త్‌

ఆర్చరీలో కుమ్‌కుమ్‌ జోరు

ఓవరాల్‌గా 85 పతకాలతో

భారత్‌కు నాలుగోస్థానం

నగోయ: ఆసియా క్రీడల్లో దాదాపు పోటీలన్నీ ముగిశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టారు. స్టార్‌ ఆటగాళ్లతో కూడిన క్రికెట్‌, హాకీ పురుషుల జట్లు అద్భుత ఆటతో జపాన్‌లో భారత క్రీడాభిమానులను అలరించాయి.

హాకీలో వరుసగా రెండోసారి..

మొన్న మహిళలు, ఈరోజు పురుషులు ఆసియా హాకీలో తమకు తిరుగు లేదని నిరూపించారు. పురుషుల హాకీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్సీలోని భారత్‌ 5-1తో మలేసియాను చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకొంది. వరుసగా రెండోసారీ ఆసియా క్రీడల టైటిల్‌ను పట్టేసింది. హర్మన్‌ప్రీత్‌ (11, 57ని.) రెండు గోల్స్‌తో సత్తా చాటగా, జుగ్‌రాజ్‌ సింగ్‌ (23ని.), హార్దిక్‌ సింగ్‌ (42ని.), షీలానంద్‌ లక్రా (54ని.) తలో గోల్‌ కొట్టారు. షెల్లో సిల్వేరియస్‌ మలేసియా తరపున ఏకైక గోల్‌ చేశాడు. హర్మన్‌ ప్రీత్‌ మొత్తం 12 గోల్స్‌తో టోర్నీ టాపర్‌గా నిలవడం విశేషం. అలాగే వరుసగా రెండు ఆసియా క్రీడల్లో జట్టును విజేతగా నిలిపిన తొలి భారత పురుష కెప్టెన్‌గా హర్మన్‌ రికార్డు నెలకొల్పాడు. వెటరన్‌ మిడ్‌ ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అత్యధికసార్లు (మూడు) ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆటగాడిగా వినుతి కెక్కాడు. ఈమూడుసార్లు భారత్‌ స్వర్ణం సొంతం చేసుకోవడం మన్‌ప్రీత్‌కు మరో రికార్డు. 2014, 2022 ఆసియా క్రీడల భారత జట్లలోనూ మన్‌ప్రీత్‌ సభ్యుడు. మనోళ్లకు ఆసియా క్రీడల్లో ఇది ఐదో బంగారు పతకం. గతంలో 1966, 1998, 2014, 2022 ఆసియాడ్‌లలోనూ టైటిల్‌ కైవసం చేసుకున్నారు. కాగా, భారత పురుషులు, మహిళల జట్లు ఒకే ఆసియాడ్‌లో పసిడి పతకాలు గెలుపొందడం ఇదే తొలిసారి. స్వర్ణ పతకం దరిమిలా పురుషుల జట్టుకు 2028లో లాస్‌ఏంజిల్స్‌లో జరిగే విశ్వ క్రీడల బెర్త్‌ కూడా లభించింది. ఇక..పాకిస్థాన్‌ జట్టు పురుషుల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది.


11 ఏళ్లకే అమ్మానాన్నను కోల్పోయి..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

హరియాణాలోని బిరోహార్‌ గ్రామానికి చెందిన అమన్‌ సెహ్రావత్‌.. లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ ఒలింపిక్‌ పతకం నెగ్గడాన్ని టీవీలో చూసి రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. అమ్మానాన్న కూడా అతని ఇష్టాన్ని కాదనలేదు. పైగా తాత కూడా ప్రోత్సహించాడు. మట్టిపై సాధన మొదలుపెట్టి.. బురదపై ప్రాక్టీస్‌ చేసేవాడు. అనంతరం ఢిల్లీలోని ఛత్రపాల్‌ స్టేడియంలో చేరి కుస్తీపై పట్టు సాధించాడు. కానీ, అప్పుడే అతని ఇంట్లో అనుకోని విషాదం నెలకొంది. అతని తల్లి మానసిక సమస్యలతో మరణించింది. ఇది తట్టుకోలేక అమన్‌ తండ్రి మరుసటి ఏడాది చనిపోయాడు. అప్పుడు అమన్‌ వయసు 11 ఏళ్లు. ఇలా పిన్నవయసులోనే అమ్మానాన్న లేని అనాధగా మారాడు అమన్‌. అప్పటికే అతనికి చెల్లి పూజ ఉంది. ఈ దశలో ఎంతో కుంగుబాటుకు గురైన అతడు.. ఓ దశలో డ్రగ్స్‌ తీసుకుందామన్న ఆలోచనలు కూడా చేశాడు. ఆటను పూర్తిగా పక్కనపెట్టేశాడు. ఈ పరిస్థితుల్లో అమన్‌కు పెదనాన్న, పెద్దమ్మ, తాత అండగా నిలిచారు. చనిపోయిన అమ్మానాన్నల కోసమైన కుస్తీలో ప్రతిభ చాటుకోవాలన్న వాళ్ల మాటలతో అమన్‌ మళ్లీ ఆటపై దృష్టి సారించాడు. కోచ్‌ లలిత్‌ కుమార్‌ శిక్షణలో రాటుదేలాడు. తనకంటే వయసులో పెద్దవాళ్లతో పోటీపడుతూ ఆటలో ముందుకు సాగాడు. 2018లో ప్రపంచ క్యాడెట్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యంతో వెలుగులోకి వచ్చాడు. మరుసటి ఏడాది ఆసియా క్యాడెట్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆసియా అండర్‌-23 చాంపియన్‌షిప్‌ నెగ్గాడు. 2022లో అండర్‌-23 ప్రపంచ చాంపియన్‌గా నిలిచి 19 ఏళ్లకే ఈ ఘనత సాధించిన భారత రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు. అక్కడినుంచి సీనియర్‌స్థాయిలో నిలకడగా సత్తాచాటుతూ 2023 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించి భవిష్యత్‌ భారత స్టార్‌గా నీరాజనాలందుకున్నాడు. ఇక, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆ విశ్వ క్రీడల సందర్భంగా తాను పోటీపడే 57 కిలోల విభాగం పతకపోరుకు ముందు బరువు ఎక్కువుండడంతో పది గంటల్లో 4.5 కిలోలు తగ్గి తన సంకల్పబలాన్ని చాటుకున్నాడు. తాజాగా ఆసియా క్రీడల్లో తన పతక ప్రదర్శనను కాంస్యం నుంచి స్వర్ణానికి మెరుగుపరచుకొని కుస్తీలో తనకు తిరుగులేదని చాటుకున్నాడు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా, పట్టుదలగా శ్రమించి కెరీర్‌లో విజయవంతమైన క్రీడాకారునిగా నిలిచిన అమన్‌ క్రీడా ప్రయాణం.. ఎంతో స్ఫూర్తిదాయకం.

కుమ్‌కుమ్‌ చారిత్రక స్వర్ణం..

టీనేజర్‌ కుమ్‌కుమ్‌ మొహోద్‌ అనిల్‌ ఆర్చరీ రికర్వ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో అనూహ్యంగా పసిడి పతకం చేజిక్కించుకుంది. హోరాహోరీగా సాగి షూటా్‌ఫకు దారి తీసిన ఫైనల్లో కుమ్‌కుమ్‌ దక్షిణకొరియా ఆర్చర్‌ వో యిజిన్‌ను షాకిచ్చింది. తుదిపోరులో తొలుత స్కోరు 5-5తో సమమైంది. దాంతో షూటాఫ్‌ నిర్వహించగా కుమ్‌కుమ్‌ పదికి పది పాయింట్లు స్కోరు చేసింది. వో యిజిన్‌ ఎనిమిది పాయింట్లే రాబట్టడంతో ఆమె రజతానికే పరిమితమైంది. ఆసియా క్రీడల రికర్వ్‌ వ్యక్తిగత కేటగిరీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా 17 ఏళ్ల కుమ్‌కుమ్‌ రికార్డు సృష్టించింది. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌ కాంగ్‌ చేయంగ్‌ (దక్షిణకొరియా)పై సంచలన విజయం సాధించిన కుమ్‌కుమ్‌..సెమీఫైనల్లో జింగ్యీ ఝు (చైనా)ను ఓడించింది. సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా కుమ్‌కుమ్‌ లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ టిక్కెట్‌ను కూడా ఖాయం చేసుకుంది.

ధీరజ్‌కు నీరజ్‌ షాక్‌: తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవరకు రికర్వ్‌ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో నిరాశఎదురైంది. సహచరుడు నీరజ్‌ చౌహాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధీరజ్‌ 4-6తో ఓడిపోయాడు. ఈసారి ఆసియా క్రీడలను భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది పతకాలతో ముగించారు.


ప్రణవి ‘డబుల్‌’

గోల్ఫ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రణవి అనూహ్యంగా పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ 23 ఏళ్ల మైసూరు అమ్మాయి ఫైనల్లో సింగపూర్‌, చైనా గోల్ఫర్‌లను వెనక్కునెట్టి చారిత్రక స్వర్ణం భారత్‌కు అందించింది. కాగా, వ్యక్తిగత విభాగంలో పసిడితో సంచలనం సృష్టించిన ప్రణవి.. అనంతరం సహచరులు అదితి అశోక్‌, దీక్షా డాగర్‌తో కలిసి టీమ్‌ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. ఇలా, ప్రణవి డబుల్‌ ధమాకా సాధించింది.

ప్రణవికి రూ. కోటి నగదు బహుమతిని ఇండియన్‌ గోల్ఫ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రకటించింది. అలాగే, అదితి, దీక్షలకు రూ. 25 లక్షల చొప్పున రివార్డును అందజేస్తామని తెలిపింది.

‘4’లో భారత్‌ టాప్‌లో చైనా

ఈసారి 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాల తో మొత్తం 85 పతకాలు నెగ్గిన భారత్‌..పట్టికలో నాలుగో స్థానంతో ఆసియా క్రీడలకు ఘనమైన ముగింపు పలికింది. ఇది గత హాంగ్జౌ క్రీడల్లో దక్కించుకున్న 107 (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) పతకాలతో పోలిస్తే ప్రదర్శన కొంతమేర తగ్గిందనే చెప్పాలి. అయితే, గత క్రీడల్లోనూ భారత్‌ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోగా, ఈసారి పతకాలు తగ్గినా పట్టికలో స్థానం మాత్రం మారకపోవడం విశేషం. ఈసారి ఆసియాడ్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుతూ చైనా 341 పతకాల (169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలు)తో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఆఖరి రోజు ఐదు స్వర్ణాలు సహా 9 పతకాలు

ఆసియా ఖండ ఆటల సంబరానికి భారత అథ్లెట్లు ఘనమైన ముగింపు ఇచ్చారు.. పోటీల ఆఖరి రోజు ఐదు పసిడి పతకాలతో దుమ్ము రేపారు..ఊహించినట్టుగానే క్రికెట్‌, హాకీలో పురుషులు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు..మహిళల మాదిరే పురుషుల హాకీ జట్టూ లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది..ఆర్చరీ, గోల్ఫ్‌లో పసిడి పతకాలు లభించగా, రెజ్లింగ్‌లో మరో బంగారం దక్కింది. ఇక, చివరి రోజు 9 పతకాలు సాధించిన భారత్‌ పట్టికలో 85 మెడల్స్‌తో నాలుగో స్థానానికి ఎగబాకింది..మరోవైపు చైనా 341, జపాన్‌ 269, ద.కొరియా 150 పతకాలతో టాప్‌-3లో నిలిచాయి.ఛి

అమన్‌ పసిడి పట్టు

రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో అమన్‌ సెహ్రావత్‌ పసిడి పట్టు పట్టాడు. ఫైనల్లో ఉత్తరకొరియాకు చెందిన ప్రపంచ చాంపియన్‌ చోంగ్‌ సాంగ్‌ హాన్‌ను 11-7తో మట్టికరిపించిన అమన్‌ విజేతగా నిలిచాడు. 23 ఏళ్ల అమన్‌ గత హాంగ్జౌ ఆసియాడ్‌లో కాంస్య పతకం నెగ్గాడు. ఇక, మహిళల 53 కిలోల తుదిపోరులో మోయి కియోకా (జపాన్‌) చేతిలో 1-9తో ఓడిన అంతిమ్‌ పంగల్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది.

60 ఏళ్ల అనంతరం..

ఇక పురుషుల 97 కిలోల విభాగంలో గన్‌కుయాగ్‌ గన్‌బాటర్‌ (మంగోలియా)ను 2-1తో ఓడించిన దీపక్‌ పూనియా కాంస్య పతకం అందుకున్నాడు. 60 ఏళ్ల తర్వాత 97 కి. ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకం లభించడం గమనార్హం. 1966 ఆసియా క్రీడల్లో భీమ్‌సింగ్‌ చివరిసారి కాంస్య పతకం నెగ్గాడు. ఈసారి ఆసియా క్రీడలలో రెజ్లింగ్‌ భారత్‌ రెండేసి స్వర్ణ, రజత, కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలు సాధించింది.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్

Updated Date - Oct 04 , 2026 | 06:16 AM