హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం వెతకడం ఆపేయండి: గావస్కర్
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:33 PM
టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హార్దిక్ పాండ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి రీప్లేస్మెంట్ కోసం ఇకనైనా ప్రయత్నాలు ఆపండని మేనేజ్మెంట్కు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడికి ప్రత్యామ్నాయం కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగాలు చేస్తూనే ఉంది. కానీ హార్దిక్‌కు తగ్గ ప్రదర్శన చేసే ప్లేయర్ మాత్రం దొరకలేదు. కొంతమేర తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ అతడికి అవకాశాలు రావడం లేదు. శివమ్ దూబె, హర్షిత్ రాణా పూర్తిగా విఫలమవుతున్నారు. ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ ప్లేయర్ నమన్ ధీర్ రాణిస్తున్నాడు. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు రీప్లేస్మెంట్ కోసం ఇకనైనా ప్రయత్నాలు ఆపండని మేనేజ్మెంట్కు సూచించాడు.
‘హార్దిక్ లాంటి ప్లేయర్ కోసం ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తున్నామని అనిపిస్తోంది. అతడిని భర్తీ చేయడం అసాధ్యం. హార్దిక్ స్థాయి ప్లేయర్ దొరకనప్పుడు భిన్నమైన నైపుణ్యం కలిగిన ఆటగాడిని ప్రయత్నించడం మంచిది. అందుకు నమన్ ధీర్ సరిగ్గా సరిపోతాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అతడు ఉపయోగపడగలడు. వెస్టిండీస్‌తో వర్షం అంతరాయం కలిగించిన ఐదో టీ20లో నమన్ ధీర్ ఆరు బంతుల్లోనే అజేయంగా 24 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. బౌలింగ్‌లోనూ తనకు కేటాయించిన ఓవర్లను సమర్థంగా వేయగలడు’ అని గావస్కర్ తెలిపాడు.
నలుగురు బౌలర్లు తప్పనిసరి!
‘టీమిండియా బౌలింగ్ విభాగంలో కనీసం నలుగురు రెగ్యులర్ బౌలర్లు ఉండాలి. ఐదు, ఆరో బౌలర్లుగా బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్లను ఎంచుకోవచ్చు. నమన్ ధీర్ లాంటి బ్యాటర్ రెండు లేదా మూడు ఓవర్లు వేయగలిగితే జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఇలా జట్టును సమతూకం చేసుకుంటే హార్దిక్ అందుబాటులో లేని సమయంలోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తొమ్మిదో నంబర్ వరకూ బ్యాటింగ్ లైనప్ ఉండాలని అనుకుంటే మాత్రం బౌలింగ్ బలహీనపడుతుంది. అందుకే ప్రత్యర్థులే సులువుగా విజయాలు సాధిస్తున్నారు’ అని గావస్కర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా