Share News

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:43 PM

అక్టోబర్ 22 నుంచి కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందులో అయిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఈ విషయంపై స్పందించాడు.

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా
Cheteshwar Pujara

ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 22 నుంచి కివీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందులో అయిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఈ విషయంపై స్పందించాడు. వైభవ్‌కు ఇప్పుడే అవకాశం దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. సంజు-వైభవ్‌ను ఒకే జట్టులో ఆడించలేరని తెలిపాడు.


‘న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో ఎక్కువ మంది టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ల కంటే జట్టుకు సమతూకం తీసుకొచ్చే ఆల్‌రౌండర్లు అవసరమవుతారు. స్పిన్‌ లేదా పేస్‌ బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్లు జట్టులో ఉండటం ఉపయోగకరం. ప్రస్తుతం సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ మరో మ్యాచ్‌లో పుంజుకునే సత్తా అతడిలో ఉంది. ఈ నేపథ్యంలో సంజు శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీలలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. సంజు ఓపెనర్‌గా బరిలోకి దిగినా, వైభవ్‌ ఆడినా.. ఇద్దరూ ఒకేసారి ఆడటం కష్టమే. వైభవ్‌ తన అవకాశాల కోసం ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. అయితే భవిష్యత్తులో అతడికి అవకాశాలు తప్పకుండా వస్తాయి. పరిస్థితులు అనుకూలించి.. జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా అవకాశం ఏర్పడినా వైభవ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు’ అని పుజారా వివరించాడు.


సంజుకు ఆ సామర్థ్యం ఉంది: అభిషేక్ నాయర్

టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా సంజు శాంసన్ ఆటతీరుపై స్పందించాడు. ‘సంజు రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోతే చాలు.. అతడి ఎంపికపై ప్రశ్నలు మొదలవుతాయి. అయినప్పటికీ ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడి విమర్శకుల నోళ్లు మూయించగల సామర్థ్యం సంజుకు ఉంది. వైభవ్‌కు అవకాశాలు కల్పించే విషయంలోనూ జట్టు సమతూకం కీలకం. ఎడమ, కుడిచేతి బ్యాటర్ల కలయికతో పాటు జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి వైభవ్‌కు అవకాశం దక్కేందుకు వెయిట్ చేయాల్సిందే’ అని నాయర్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

కివీస్ టెస్టు సిరీస్‌కు ముందు నిరాశపరిచిన గిల్.. వీడియో వైరల్

విండీస్ క్రికెట్‌కు ఆర్థికంగా అండగా నిలవండి: కోచ్ డారెన్ సామీ

Updated Date - Oct 18 , 2026 | 04:43 PM