Share News

విండీస్ క్రికెట్‌కు ఆర్థికంగా అండగా నిలవండి: కోచ్ డారెన్ సామీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 02:51 PM

భారత్‌తో సిరీస్ ఆడటం వల్ల తమకు ఎలాంటి ఆదాయం రాదని ఇటీవలే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో డెహ్రింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై విండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశాడు

విండీస్ క్రికెట్‌కు ఆర్థికంగా అండగా నిలవండి: కోచ్ డారెన్ సామీ
Darren Sammy

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ డ్రాగా ముగిసింది. విండీస్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియాను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే భారత్‌తో సిరీస్ ఆడటం వల్ల తమకు ఎలాంటి ఆదాయం రాదని ఇటీవలే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో డెహ్రింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై విండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో కుదేలవుతున్న తమకు చేయూతనివ్వాలని కోరాడు.


‘మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. బాధ్యతాయుతమైన శ్రద్ధ ఉండాలి. ఏ పని చేసినా దానిని మాత్రం కోల్పోవద్దు. ఇప్పుడు విండీస్ క్రికెట్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉందని అనుకుంటున్నా. మాకు ఆర్థికంగా అండగా నిలిచే వారు అవసరం. భారత్‌లోని క్రికెట్ మౌలిక సదుపాయాలు, విండీస్ ఎదుర్కొంటున్న సవాళ్లను పోల్చి చూస్తే పరిస్థితుల్లో ఎంత వ్యత్యాసం ఉందో అర్థమవుతుంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ ఎక్కడ ఆడినా విజయం సాధించాలనే అంచనాలతో బరిలోకి దిగుతుంది. అందుకు కారణం ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడులు, పటిష్ఠమైన వ్యవస్థలు. అదే విండీస్ విషయానికి వస్తే ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఆడాల్సి వస్తోంది. అయినప్పటికీ మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించగలమనే నమ్మకం తిరిగి వచ్చింది. మా ప్లేయర్లు అందరికీ నా అభినందనలు.


భారత్‌తో ఇలాంటి సిరీస్‌లు ఆడటం వల్ల తమ జట్టుపై స్పాన్సర్లు, పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నా. ఈ ప్రదర్శనతో క్రికెట్ వెస్టిండీస్ బోర్డు సంబంధిత వర్గాలతో మరింత మెరుగ్గా చర్చలు జరిపే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. పెట్టుబడులు వస్తే జట్టును అన్ని విధాలా మెరుగుపర్చుకోవచ్చు’ అని డారెన్ సామీ వివరించాడు.


ఈ వార్తలనూ చదవండి:

సీఎస్‌కే, కేకేఆర్ కాదు.. హార్దిక్ పాండ్యా ఆ జట్టులోకి వెళ్లొచ్చు: అశ్విన్

డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్‌ వేలం

Updated Date - Oct 18 , 2026 | 02:51 PM