Share News

గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:27 PM

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్‌తో కీలక వన్డే సిరీస్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపై చేసిన ఓ ప్రాంక్‌ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.

గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?
Harbhajan Singh Ganguly prank

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అప్పట్లో జట్టులోని ప్లేయర్లు చుక్కలు చూపించారట! పాకిస్థాన్‌తో కీలక వన్డే సిరీస్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపై చేసిన ఓ ప్రాంక్‌ను టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా గంగూలీని ప్రాంక్ చేయాలని యువరాజ్ సింగ్‌తో కలిసి ప్లాన్ చేసినట్లు వెల్లడించాడు. దాదాని ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా భయపెట్టామని చెప్పాడు. పాక్ సిరీస్‌కు ముందు జరిగిన ఈ విషయాన్ని భజ్జీ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.


‘ఆ రోజు జట్టు మొత్తం డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉంది. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా దాదాను ప్రాంక్ చేద్దామని యువరాజ్ ప్లాన్ వేశాడు. యువీ దాదా దగ్గరకు వెళ్లి ప్లాన్ అమలు చేశాడు.. ‘మీరు చేసిందేం బాలేదు. నన్ను పార్టీ యానిమల్ అన్నారు. హర్భజన్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ కూడా మ్యాచ్‌లు ఆడటం కంటే ఎక్కువగా పార్టీలు చేసుకుంటారని మీడియా ముందు చెప్పారు. ఇలా చేయడం పద్ధతేనా?’ అని యువీ దాదాను ప్రశ్నించాడు. దీంతో గంగూలీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ‘నేనెప్పుడు అలా అన్నాను?’ అంటూ తిరిగి ప్రశ్నించాడు. మేం ముందే సిద్ధం చేసుకున్న తప్పుడు వార్తా క్లిప్పింగ్ అతడికి చూపించాం. దీంతో నిజంగానే అలా మాట్లాడానా? అని గంగూలీ ఆందోళన పడటం మొదలుపెట్టాడు’ అంటూ భజ్జీ వివరించాడు.


రంగంలోకి సచిన్‌, ద్రవిడ్..

ప్రాంక్‌ను మరింత రక్తి కట్టించేందుకు సీనియర్ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లను కూడా రంగంలో దించినట్లు భజ్జీ వెల్లడించాడు. ‘ఈ విషయమంతా సచిన్ పాజీకి నేను ముందే చెప్పాను. మీరు కూడా ఈ ప్లాన్‌లో ఉంటే బాగుంటుందని ఒప్పించా. సచిన్, రాహుల్ కూడా దాదాకు ఎలాంటి అనుమానం రాకుండా నటించారు. ‘మీడియా ముందు నువ్వు ఇలా మాట్లాడటం అస్సలు పద్ధతి కాదు దాదా’ అని సచిన్ పాజీ, ‘దాదా.. ఇది తప్పు’ అని రాహుల్ భాయ్ గంగూలీతో అన్నారు. ఇద్దరు సీనియర్ ప్లేయర్లు కూడా చెబుతుండటంతో గంగూలీ నిజంగానే తప్పు చేశానేమో అని భయపడ్డాడు. ఆ వ్యాఖ్యలు తానే చేశానని రుజువైతే కెప్టెన్సీనే వదులుకుంటానని తెలిపాడు’ అని హర్భజన్ వెల్లడించాడు.


ఇంకా అయిపోలేదు..!

ఇంతటితో ప్రాంక్‌ ఆగలేదు. హర్భజన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు కోపంగా తమ కిట్లు తీసుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో గంగూలీ మరింత కంగారుపడ్డాడు. ‘అయ్యో.. ఆగండి! రేపు మ్యాచ్‌ ఉంది. మీరేం చేస్తున్నారు?’ అంటూ గంగూలీ వారి వెంట పరుగెత్తాడని హర్భజన్‌ నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు. చివరికి ఎవరో నవ్వేయడంతో అసలు విషయం బయటపడింది. గంగూలీని తాము మరీ ఇబ్బంది పెట్టేశామని అప్పట్లో అందరూ భావించారట. ‘మరో కెప్టెన్‌ అయితే నిజంగానే మా బ్యాగులు బయటకు విసిరేసి ఇంటికి వెళ్లిపోమని చెప్పేవాడు. కానీ దాదా మాకు అన్నయ్య లాంటివాడు’ అని భజ్జీ చెప్పాడు.


‘హ్యాపీ డ్రెస్సింగ్‌ రూమ్‌.. విన్నింగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌’

ఇలాంటి సరదా ప్రాంక్‌లు జట్టులో ఆటగాళ్ల మధ్య అనుబంధాన్ని పెంచుతాయని హర్భజన్‌ చెప్పాడు. ఎప్పుడూ క్రికెట్‌ గురించే మాట్లాడుకుంటూ ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం గంభీరంగా మారిపోతుందని, సరదా పోతుందని అన్నాడు. ‘హ్యాపీ డ్రెస్సింగ్‌ రూమ్‌ అంటే విన్నింగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌. మైదానంలో ఏం జరిగినా అక్కడితో వదిలేయాలి. దానినే పట్టుకుని కూర్చుంటే లాభం ఉండదు. వాతావరణం భారంగా మారుతుంది’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. ఆ సరదా వాతావరణం తర్వాతి మ్యాచ్‌లోనూ కనిపించిందని చెప్పొచ్చు. పాకిస్థాన్‌పై భారత్‌ 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సెంచరీలు బాదగా.. సచిన్‌ టెండూల్కర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఆ తర్వాత పుంజుకోలేకపోయిన టీమిండియా.. చివరకు సిరీస్‌ను 2-4తో చేజార్చుకుంది.


ఇవి కూడా చదవండి:

అరంగేట్ర మ్యాచ్‌లోనే శ్రీలంక బౌల‌ర్‌ చెత్త రికార్డు

ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే

Updated Date - Aug 17 , 2026 | 03:27 PM