'ది హండ్రెడ్' ఛాంపియన్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:27 PM
'ది హండ్రెడ్' 2026 పురుషుల టోర్నీ విజేతగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన తుదిపోరులో ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. మాంచెస్టర్ జట్టుకు ఇదే తొలి ట్రోఫీ కావడం విశేషం.
స్పోర్ట్స్ డెస్క్: లండన్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన 'ది హండ్రెడ్' (The Hundred 2026) పురుషుల టోర్నీ ఫైనల్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన తుదిపోరులో ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది.. తొలిసారిగా ది హండ్రెడ్ ట్రోఫీని ముద్దాడింది.
మ్యాచ్ విషయానికి వస్తే... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్ జట్టు నిర్ణీత బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (31), ఫిన్ అలెన్ (15) పర్వాలేని అనిపించారు. అలానే మిడిలార్డర్‌లో అన్యూరిన్ డొనాల్డ్ (38), కెప్టెన్ లూయిస్ గ్రెగొరీ (32), మిచెల్ శాంట్నర్ (20 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. మాంచెస్టర్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా, సోనీ బేకర్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (Tim Seifert) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 7సిక్సర్లతో 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడుగా పాల్ వాల్టర్ (22), జోస్ బట్లర్ (23), డూప్లూయ్ (27 నాటౌట్) రాణించారు. చివరిలో కాస్త తడబడినప్పటికీ లియామ్ డాసన్ విజయవంతంగా లాంఛనం ముగించడంతో మాంచెస్టర్ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
అరంగేట్ర మ్యాచ్‌లోనే శ్రీలంక బౌలర్ చెత్త రికార్డు
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే