పంత్ బ్యాటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కైఫ్
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:31 AM
గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగుల భారీ స్కోర్ చేసింది. చాలా కాలం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగుల భారీ స్కోర్ చేసి.. పటిష్ఠ స్థితిలో ఉంది. మరోవైపు చాలా కాలం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ (Rishabh Pant) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 62 బంతుల్లో కేవలం 39 పరుగులు చేశాడు. గతంలో చేసిన తప్పులనే మరో సారి పునరావృతం చేశాడు. భారీ షాట్‌కు యత్నించి మిడ్ ఆఫ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పంత్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Kaif) విమర్శలు గుప్పించాడు. దూకుడుగా ఆడదామనే ఉద్దేశం మంచిదే అయినా సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉందని సూచించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్‌లో కైఫ్ మాట్లాడుతూ... ‘రిషభ్ పంత్ ఇలా ఔట్ కావడంలో నాకు ఎలాంటి అసహనం లేదు. అతడు మాత్రమే ఇలా ఆడగలడు. కానీ, నా ఆరోపణ ఏమిటంటే కొత్త బంతి వచ్చాక అతడు ఎదుర్కొన్న తొలి ఓవర్ గురించే. అప్పటికే మూడుసార్లు ముందుకొచ్చి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అలాంటప్పుడు కనీస జ్ఞానంతో ఆడి కట్ షాట్ ఆడి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది. ఐదు, ఆరు ఓవర్ల పాటు కొత్త బంతిని ఆచితూచి ఆడాలి. ఎవరైనా సరే కాస్త కామన్‌సెన్స్‌తో బంతిని ఎదుర్కోవాలి’ అని కైఫ్ తెలిపాడు.
‘ఆ కొత్త బంతితో కేశర నువాంత వేసిన ఓవర్ తొలి బంతికే ముందుకొచ్చి రిషభ్ పంత్ షాట్ కొట్టడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మరో వైపు 150+ పరుగులు చేసిన బ్యాటర్(దేవదత్ పడిక్కల్) కూడా కొత్త బంతి వచ్చాక ఆచితూచి ఆడాడు. అలాంటి పరిణతి ప్రతి ఆటగాడికి కావాలి. ఈ విషయంలో రిషభ్ పంత్ మార్కులు తగ్గిస్తాను. లాజిక్.. క్రికెటింగ్ సెన్స్‌ను ఉపయోగించడంలో పంత్ వెనుకబడిపోయాడు. అందుకే, షాట్ల ఎంపికలో జాగ్రత్త వహించాలి’ అని కైఫ్ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే కోచ్‌గా ఆ స్టార్ ప్లేయర్లు వద్దు: క్రిష్ శ్రీకాంత్