Share News

నేడు బీజేపీ కొత్త జట్టు!

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:50 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు..

నేడు బీజేపీ కొత్త జట్టు!

యువత, మహిళలకు కీలక పదవులు.. కొందరు కేంద్ర మంత్రులకూ చోటు

  • ఆ తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 16: వచ్చే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళనల నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నూతన జట్టును సోమవారం ప్రకటించనున్నారు. కొందరు కేంద్ర మంత్రులకు కూడా ఇందులో చోటు కల్పించనున్నట్లు తెలిసింది. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా(ఫిబ్రవరి-మార్చి), గుజరాత్‌, మణిపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌(నవంబరు-డిసెంబరు) రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నూతన కార్యవర్గాన్ని రూపొందించినట్లు సమాచారం. కొత్త కార్యవర్గ ప్రకటన కాగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేపడతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో జాతీయ సారథ్య బాధ్యతలు చేపట్టిన నబీన్‌.. కొత్త జట్టు కూర్పు దిశగా అగ్ర నేతలతో పెద్దఎత్తున కసరత్తు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలతో జాతీయ కార్యవర్గంపై విస్తృతంగా చర్చలు జరిపారు. వాస్తవానికి జూన్‌లో రాజ్యసభ ఎన్నికలు ముగియగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీలపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వాయిదావేశారు. నబీన్‌ రాజీనామాతో ఖాళీఅయిన బిహార్లోని బంకీపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ పరాజయం ఆ పార్టీ నేతలకు భారీ షాకిచ్చింది. 30 ఏళ్లుగా నిరాటంకంగా గెలుస్తున్న స్థానాన్ని, అదీ.. జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన సీటును కోల్పోవడం భవిష్యత్‌ రాజకీయ మార్పులకు సూచికంటూ రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం దీనిపై ఇప్పటికే లోతైన సమీక్ష జరిపింది. వచ్చే ఏడాది కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నందున.. పార్టీని అందుకు సన్నద్ధం చేయడానికి తగిన వ్యూహాలకు కొత్త కార్యవర్గం పదునుపెడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాతీయ అధికార ప్రతినిధులు, వివిధ మోర్చాల అధిపతులను ప్రకటించనున్నట్లు తెలిపాయి.


దిమాగీ నక్సల్స్‌ జాబితా ఇదిగో: రిజిజు

ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్‌’ అని ప్రతిపక్ష నేతలనుద్దేశించి అనలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. తనను ‘దిమాగీ నక్సల్‌’గా పరిగణించడాన్ని గర్వంగా భావిస్తున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తదితరులు వ్యాఖ్యానించడంతో ఆదివారం మంత్రి వివరణ ఇచ్చారు. ‘మావోయిస్టుల మద్దతుదారులను.. భారత రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని.. వేర్పాటువాదులకు అండగా ఉన్నవారిని.. 370 అధికరణకు మద్దతిచ్చేవారిని.. ఈశాన్య భారతాన్ని మిగతా దేశం నుంచి వేరుచేయాలని పిలుపిచ్చినవారిని మాత్రమే ‘దిమాగీ నక్సల్స్‌’ అని ప్రధాని అన్నారు. విపక్ష నేతలను ఆయనా మాట అనలేదు’ అని తేల్చిచెప్పారు.

ఎర్రకోటకు వెళ్లే ముందు ‘మిత్రుల’కు ఆహారం

ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ తన అఽధికారిక నివాసంలోని ‘స్నేహితులై’న ఆవులు, నెమళ్లకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆదివారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘ప్రతి రోజూ ఉదయం నా మిత్రులకు ఆహారం అందించడం రొటీన్‌గా జరిగే దినచర్య. నిన్న మాత్రం నేను ముందుగానే వెళ్తున్నానని ఎలాగోలాగ గమనించాయి. ఎర్రకోటకు బయలుదేరడానికి ముందు నన్ను కలవడానికి వచ్చేశాయి. ఎప్పటిలాగానే ఇది ప్రత్యేకం’ అని పేర్కొన్నారు. ఆయన తన నివాసంలో పుంగనూరు జాతి వామన ఆవులతో పాటు, నెమళ్లను పెంచుతున్నారు.

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 06:50 AM