మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు.. నా వద్ద ఆడియోలు ఉన్నాయి: అన్నామలై..
ABN , Publish Date - Aug 17 , 2026 | 01:36 PM
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వంపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ల నుంచి కొందరు మంత్రులు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వంపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ల నుంచి కొందరు మంత్రులు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డులు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అన్నామలై తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.
చెన్నైలో నిన్న (ఆదివారం) నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో అన్నామలై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ అవినీతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరితో ఉన్నారని, కానీ కొందరు మంత్రుల వ్యవహారశైలి అందుకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. గతంలో కీలక టెండర్ల విషయంలో కమీషన్ల డిమాండ్లు లేవని, ఇప్పుడు కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి వాటాలు అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో తాము డబ్బులు ఖర్చు చేశామని చెబుతూ.. కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నామలై ఆరోపించారు. రెండు శాతం ఇవ్వాలని, మూడు శాతం ఇవ్వాలని, అవసరమైతే నాలుగు శాతం ఇవ్వాలని అడుగుతున్నట్లుగా ఆడియో రికార్డులు తన వద్ద ఉన్నాయని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి విజయ్ మరింత నిఘా పెట్టాలని అన్నామలై సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలనను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, కిందిస్థాయిలో జరుగుతున్న అక్రమాలపైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే అవినీతి ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో మంత్రులు నిజంగా కమీషన్ల అడిగారా, లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అన్నామలై వ్యాఖ్యలపై విజయ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు.. సంచుల నిండా డబ్బులే..
ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..