అశోక్ ధామ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:55 PM
బిహార్ లఖిసరాయ్‌లోని అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదం గురించి తెలుసుకుని మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు.
బిహార్: లఖిసరాయ్‌లోని అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదం గురించి తెలుసుకుని మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు చేశారు.
‘బిహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది’ అని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు, బాధితులకు బిహార్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఈ ప్రమాదం గురించిన వివరాలను లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా జలాభిషేకం చేసేందుకు నేడు వేలాది మంది భక్తులు అశోక్ ధామ్ ఆలయానికి చేరుకున్నట్లు తెలిపారు. దర్శనం కోసం మహిళలు, పురుషులు రెండు క్యూ లైన్లలో నిలబడి ఉండగా.. పురుషుల క్యూ లైన్‌కు సమీపంలో విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా కూలిపోయిందన్నారు. స్తంభానికి ఉన్నది కేబుల్ వైర్ అయినప్పటికీ.. విద్యుత్ వైర్ అనే పుకారు క్షణాల్లో వ్యాపించిందని పేర్కొన్నారు. దీంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
సుమారు రెండు నిమిషాల వ్యవధిలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 12 మందికి పైగా గాయపడినట్లు జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..
ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు.. సంచుల నిండా డబ్బులే..