Share News

ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..

ABN , Publish Date - Aug 17 , 2026 | 11:15 AM

ఇండోనేషియాను వరుస భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ఆగస్టు 15న సంభవించిన భారీ భూకంపంతో సుమారు 59 మంది మృతిచెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోసారి నేడు ప్రకంపనలు సంభవించడంతో ఇండోనేషియా ప్రజలు బెంబేలెత్తిపోయారు.

ఇండోనేషియాను కుదిపేసిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో భూప్రకంపనలు..
Indonesia Earthquake

జకార్తా: ఇండోనేషియాను వరుస భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. గత శనివారం (ఆగస్టు 15న) సంభవించిన భారీ భూకంపంతో సుమారు 59 మంది మృతిచెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రకంపనలు సంభవించడంతో ఇండోనేషియా ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఫ్లోరెస్ ప్రాంతంలో సోమవారం 5.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు జర్మనీకి చెందిన GFZ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. రెండ్రోజుల కిందటే మృత్యువు నుంచి తప్పించుకున్న వారిని తాజా ప్రకంపనలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.


ఆగస్టు 15న ఇదే ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం విలయతాండవం చేసింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో భూకంపం వచ్చింది. దీని కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడటం, వేలాది ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విపత్తులో సుమారు 59 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్ వ్యాప్తంగా 900కు పైగా ఇళ్లు ధ్వంసమవగా.. మరో 450 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 5 వేల మందిని అధికారులు తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. మరోవైపు, ఫ్లోరెస్ ప్రాంతంలోనూ 241 ఇళ్లు దెబ్బతిన్నగా.. 135 మంది గాయపడ్డారు.


భూకంపం తర్వాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయగా.. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. మరోవైపు, మంగరాయ్, తూర్పు మంగరాయ్, నాగేకియో ప్రాంతాలూ దెబ్బతిన్నాయి. దీంతో శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 17 వేలకు పైగా ద్వీపాలున్న ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

లక్ష్మీ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి.. ఇద్దరు కార్మికుల మృతి..

ఇరాన్ అణ్వాయుధాలు.. ఫేక్ సోషల్ మీడియా పోస్టుపై నెతన్యాహు స్పందన..

Updated Date - Aug 17 , 2026 | 11:46 AM