పడిక్కల్ ఒక అరుదైన బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:34 AM
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు శతకం(167) బాది భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో పటిష్ఠ స్థితిలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. లంక బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 230 బంతుల్లో ఏకంగా 167 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. గతంలో ఐపీఎల్‌లో (2020, 2021 సీజన్లలో) పడిక్కల్‌తో కలిసి బ్యాటింగ్ చేసిన అనుభవాన్ని డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. 'పడిక్కల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎడమచేతి వాటం ఆటగాడైన అతను, సబ్-కాంటినెంట్ ఆటగాడైనప్పటికీ షార్ట్ పిచ్ బంతులను చాలా బాగా ఆడగలడు. నేటి తరపు ఆధునిక భారతీయ బ్యాటర్లలో షార్ట్ బాల్స్‌ను సమర్థంగా ఎదుర్కొనే అరుదైన ఆటగాడు' అని డివిలియర్స్ కొనియాడాడు.
అంతేకాకుండా, పడిక్కల్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడని తెలిపాడు. అలానే ఎలాంటి అహంభావం లేకుండా సీనియర్లు చెప్పే సలహాలను స్వీకరించే మనసత్వం పడిక్కల్‌ది అని అతడు ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రశంసించాడు. మొత్తంగా పడిక్కల్ ప్రదర్శన భవిష్యత్తులో భారత టెస్టు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పంత్ బ్యాటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కైఫ్
సీఎస్కే కోచ్‌గా ఆ స్టార్ ప్లేయర్లు వద్దు: క్రిష్ శ్రీకాంత్