Share News

డ్రైనేజ్ తవ్వుతుంటే బయటపడిన రూ.98 కోట్ల బంగారం.. 18 ఏళ్ల యువకుడికి దొరికిన భారీ నిధి..

ABN , Publish Date - Aug 17 , 2026 | 09:39 AM

సాధారణంగా మురుగు కాలువ పనులు చేస్తుండగా మట్టి, రాళ్లు బయటపడటం సహజం. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి మాత్రం ఏకంగా కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది. డ్రైనేజీ పైపుల కోసం తవ్వకాలు చేపడుతుండగా అతడికి బంగారు నాణేలు, బంగారు కడ్డీలు కనిపించాయి.

డ్రైనేజ్ తవ్వుతుంటే బయటపడిన రూ.98 కోట్ల బంగారం.. 18 ఏళ్ల యువకుడికి దొరికిన భారీ నిధి..
Belgium gold treasure

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మురుగు కాలువ పనులు చేస్తుండగా మట్టి, రాళ్లు బయటపడటం సహజం. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి మాత్రం ఏకంగా కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది. డ్రైనేజీ పైపుల కోసం తవ్వకాలు చేపడుతుండగా అతడికి బంగారు నాణేలు, బంగారు కడ్డీలు కనిపించాయి. ఈ మొత్తం నిధి విలువ సుమారు 90 లక్షల యూరోలు.. భారత కరెన్సీలో దాదాపు రూ.98 కోట్లు ఉంటుందని అంచనా (Belgium gold treasure).


సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో ఓ నిర్మాణ సంస్థలో వేసవి ఉద్యోగిగా పనిచేస్తున్న 18 ఏళ్ల కోబే ఈ నిధిని గుర్తించాడు. సహచరులతో కలిసి మురుగు కాలువ కోసం భూమిని తవ్వుతుండగా ఏదో వస్తువు కనిపించింది. మొదట అవి సాధారణ ఒక యూరో నాణేలు అనుకున్నామని కోబే చెప్పాడు. మరికొంత తవ్విన తర్వాత బంగారు కడ్డీ కనిపించడంతో అసలు విషయం అర్థమైందని వివరించాడు. బంగారు నాణేలు, బంగారు కడ్డీలను ఓ సంచిలో పెట్టి, పాత భవనం కింద ఉన్న నేలమాళిగ గోడలో ఇటుకల మధ్య దాచినట్లు తెలిపాడు (Sewer work gold discovery).


ఈ భవనం 19వ శతాబ్దం చివర్లో బీరు తయారీ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన విల్లాగా తెలుస్తోంది. నిధి బయటపడిన వెంటనే కోబే, అతడి సహచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని బ్రస్సెల్స్‌లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దాచారు? అసలు యజమాని ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు జరుగుతోంది (Hidden gold treasure).


ఈ నిధిపై హక్కు విషయంలో ఇప్పుడు అసలు వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. బెల్జియం చట్టం ప్రకారం అసలు యజమానులు లేదా వారి వారసులు నిధిపై హక్కును కోరేందుకు ఐదేళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవధిలో ఎవరూ హక్కును నిరూపించలేకపోతే తదుపరి చట్టపరమైన ప్రక్రియ అమలవుతుంది. భారీ నిధిని గుర్తించిన కోబే, అతడి సహచరులకు కూడా రివార్డ్ లభించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 17 , 2026 | 10:51 AM