Shubman Gill: మరోసారి తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్ పేరు.. టెస్టుల్లో మార్పు కోరుతున్న గిల్!
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:58 PM
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2025లో భారత టెస్టు జట్టు తీవ్ర నిరాశను ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. అంతకుముందు నవంబర్ 2024లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన టీమిండియా.. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు. ప్రతి టెస్టు సిరీస్‌కు ముందు తప్పనిసరిగా 15 రోజుల రెడ్‌బాల్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ(BCCI)ని కోరినట్లు సమాచారం.
ప్రాక్టీస్ లేమి వల్లే..
‘టెస్టు సిరీస్‌కు ముందు సరైన సన్నాహాలు జరగడం లేదు. ఈ విషయంలో గిల్(Shubman Gill) స్పష్టంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో షెడ్యూల్ చాలా గందరగోళంగా ఉండటంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేయడానికి సరైన సమయం దొరకలేదు. కనీసం 15 రోజుల రెడ్ బాల్ క్యాంప్ ఉంటేనే ఫలితాలు వస్తాయని గిల్ బోర్డుకు సూచించాడు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ వల్లే..
2025లో భారత జట్టు చాలా బిజీ అయింది. ఆసియా కప్ గెలిచిన నాలుగు రోజుల్లోనే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడింది. అలాగే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన ఆరు రోజుల్లోనే దక్షిణాఫ్రికాతో టెస్టులు ప్రారంభమయ్యాయి. 2026లోనూ భారత్‌కు వరుసగా వైట్ బాల్ సిరీస్‌లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి టెస్టు సిరీస్‌కు 15 రోజుల క్యాంప్ నిర్వహించడం పెద్ద సవాలేనని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించనున్నారా?
ఈ క్యాంపుల నిర్వహణ కోసం బీసీసీఐ కొత్త మార్గం ఆలోచిస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా వైట్‌బాల్ జట్లతో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో.. నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సేవలను వినియోగించాలనే ఆలోచనలో బోర్డు ఉందని సమాచారం. ‘కొన్ని సందర్భాల్లో గంభీర్ వైట్‌బాల్ టీమ్‌తో ఉంటారు. అదే సమయంలో టెస్టు సిరీస్ దగ్గరపడితే.. రెడ్ బాల్ క్యాంప్ నిర్వహణ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించే అవకాశం ఉంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384