Ambati Rayudu: తండ్రైన స్టార్ తెలుగు క్రికెటర్.. !
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:40 AM
టీమిండియా మాజీ క్రికెటర్, మన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతడి సతీమణి విద్య పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ మేరకు రాయుడు.. ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతడి సతీమణి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాయుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. తన భార్య, బిడ్డతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పెట్టి.. ‘మాకు కొడుకు పుట్టాడు.. ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అంబటి రాయుడు, విద్యకు 2009లో వివాహం జరిగింది. 2020 జూలైలో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపకు వివియా అని పేరు పెట్టారు. అనంతరం 2023లో రెండోసారి తండ్రి కాగా.. మరోసారి కూతురే పుట్టింది. తాజాగా 40 ఏళ్ల వయసులో అంబటి రాయుడు మూడో సారి తండ్రి కాగా.. ఈసారి మగ బిడ్డ పుట్టాడు. అంబటి రాయుడుకు సహచర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
2023లో రాయుడు(Ambati Rayudu) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వైసీపీలో చేరి.. అంతే వేగంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత జనసేనలో చేరాడు. కానీ క్రీయాశీలక రాజకీయాలకు మాత్రం ప్రస్తుతం దూరంగానే ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రాయుడు.. మొత్తం ఆరు సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు.
కామెంటేటర్‌గా..
రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా అవతారమెత్తిన రాయుడు.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో అభిమానుల ఆగ్రహానికి బలైయ్యాడు. విరాట్ కోహ్లీ లక్ష్యంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను తప్పుబడుతూ అతను చేసిన ట్వీట్.. నెట్టింట తీవ్ర దుమారం రేపింది. ‘కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది’.. అని అతను చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వివాదాల నేపథ్యంలో అంబటి రాయుడిని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384