Ind Vs NZ: జట్టులో అసలు నితీశ్ కుమార్ ఎందుకు?.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 08:50 AM
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టి అతడిని ఎందుకు ఎంపిక చేశారంటూ మాజీ క్రికెటర్ బద్రినాథ్ ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ జట్టు ఎంపికపై ఇప్పటికే తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతినివ్వడం , మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో మాజీ భారత క్రికెటర్ సుబ్రమణ్యం బద్రినాథ్(Subramaniam Badrinath).. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nithish Kumar Reddy) ఎంపికపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు.
నితీశ్ ఎందుకు?
‘రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. అలాంటప్పుడు నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అతడిని ఆల్‌రౌండర్ అంటున్నారు కానీ బౌలింగ్‌లో మాత్రం తీవ్రంగా పరుగులు ఇస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)కు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. అతడిని పక్కన పెట్టి నితీశ్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక లాజిక్ కనిపించడం లేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌లో చోటు లేకపోవడంతో రుతురాజ్‌ను నంబర్ 4లో పంపారు. అక్కడ కూడా శతకం చేశాడు. ఆ తర్వాత లిస్ట్ ఏ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు, ఒక అర్ధ శతకం చేశాడు. మొత్తం లిస్ట్ ఏ సగటు 57కి పైగా ఉంది. 5 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌కు చోటు దక్కకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
మంచి ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టి.. అంతగా రాణించని నితీశ్ కుమార్ రెడ్డిని వన్డే జట్టులోకి తీసుకోవడంపై అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జట్టు ఎంపికపై క్రికెట్ మాజీల నుంచి అభిమానుల వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులోకి అయితే తీసుకున్నారు కానీ తుది జట్టులో నితీశ్‌కు చోటు దక్కుతుందా? దక్కిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటాడా? అనేది మాత్రం చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా హిందూ క్రికెటర్.. అసలెవరీ లిట్టన్ దాస్?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!