Share News

T20 World Cup 2026: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా హిందూ క్రికెటర్.. అసలెవరీ లిట్టన్ దాస్?

ABN , Publish Date - Jan 05 , 2026 | 08:04 AM

టీ20 ప్రపంచ కప్ 2026 సంబంధించి బంగ్లాదేశ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా నియమితుడైన లిట్టన్ దాస్.. ఓ హిందూ క్రికెటర్. గతంలో తన మత విశ్వాసాల కారణంగా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రానున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌కు ఆయనే ప్రధాన బలం కానున్నారు.

T20 World Cup 2026: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా హిందూ క్రికెటర్.. అసలెవరీ లిట్టన్ దాస్?
Litton Das

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో కొత్త కెప్టెన్‌గా లిట్టన్ దాస్‌ను నియమించింది. ఇప్పటికే 2025 మేలో టీ20 ఫార్మాట్‌కు శాశ్వత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన లిట్టన్.. ఇప్పుడు ప్రపంచకప్‌(T20 World Cup 2026)లోనూ జట్టును నడిపించనున్నాడు. మాజీ కెప్టెన్ నజ్ముల్ హొసైన్ షాంటో స్థానంలో ఈ వికెట్‌కీపర్-బ్యాటర్‌కు బీసీబీ పూర్తి బాధ్యతలు అప్పగించింది. హిందూ మతానికి చెందిన లిట్టన్ దాస్(Litton Das).. గతంలో తన మత విశ్వాసాల కారణంగా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రానున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌కు ఆయనే ప్రధాన బలం కానున్నారు. పర్వేజ్ హొసైన్ ఎమోన్, తంజిద్ హసన్‌లతో కలిసి కీలక పాత్ర పోషించనున్నారు.


అసలెవరీ లిట్టన్ దాస్?

1994లో బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన లిట్టన్ దాస్.. 2015లో భారత్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఎనిమిది రోజులకే వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో టీ20 ఇంటర్నేషనల్‌లో తొలిసారి ఆడాడు. కెరీర్ ప్రారంభంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చిన లిట్టన్.. 2017 నుంచి వికెట్‌కీపింగ్ బాధ్యతలు కూడా స్వీకరించాడు. దీంతో ముష్ఫికర్ రహీమ్ పూర్తిస్థాయి బ్యాటర్‌గా కొనసాగాడు.


2018 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై లిట్టన్ ఆడిన శతకం క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడినా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లిట్టన్‌కే దక్కడం విశేషం. 2020 మార్చిలో జింబాబ్వేపై 143 బంతుల్లో 176 పరుగులు చేసి.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసి ప్లేయర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 3,117, వన్డేల్లో 2,569, టీ20ల్లో 2,655 పరుగులు సాధించిన లిట్టన్.. అన్ని ఫార్మాట్లలోనూ బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించాడు. అయితే 2025లో టీ20 జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా నియమితుడవడం అతడి కెరీర్‌లో కీలక మైలురాయి.


అభిమానుల టార్గెట్‌..

2025 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సమయంలో లిట్టన్ దాస్‌పై అభిమానులు దాడి చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఢాకా క్యాపిటల్స్ తరఫున ఫార్చ్యూన్ బరిషాల్‌తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు మతపరమైన అంశంలో అతడిని తీవ్రంగా అవమానించారు. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అయింది. నకిలీ ఆటగాడు, చెత్త ప్లేయర్ అంటూ అభిమానులు స్టేడియం నుంచే నినాదాలు చేస్తూ లిట్టన్‌ను అవమానించారు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న లిట్టన్.. ఎలాంటి స్పందన ఇవ్వకుండా ప్రశాంతంగా తన పనిని కొనసాగించడం అప్పట్లో ప్రశంసలు పొందింది. అన్ని అడ్డంకుల మధ్య ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆశలన్నీ లిట్టన్ దాస్‌పైనే నిలిచాయి.


ఇవి కూడా చదవండి:

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్‌లు శ్రీలంకకు తరలింపు!

Updated Date - Jan 05 , 2026 | 09:23 AM