Rohit Sharma: ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:42 AM
భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో వెళ్తున్న రోహిత్‌ను చూసి ఇద్దరు యువ అభిమానులు అతడి దగ్గరికి వచ్చారు. రోహిత్‌తో అతిగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయిన హిట్‌మ్యాన్ వాళ్లను హెచ్చరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో వెళ్తున్న రోహిత్‌ను చూసిన ఇద్దరు యువ అభిమానులు అతడి దగ్గరకు వచ్చారు. అభిమానులను చూసి కార్ విండో నుంచి చేయి బయటకు తీసి అభివాదం చేసిన రోహిత్‌తో తొలుత ఒక అభిమాని చేతులు కలిపాడు. అయితే అక్కడితో ఆగని ఇద్దరు వ్యక్తులు.. రోహిత్ చేతిని లాగుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. అభిమానుల ఈ ప్రవర్తనతో అసహనం వ్యక్తం చేసిన రోహిత్(Rohit Sharma).. వారిని హెచ్చరిస్తూ చేతిని వెనక్కి తీసుకుని వెంటనే కార్ విండోను పైకి ఎత్తేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అద్భుతమైన ఫామ్..
ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడిన రోహిత్ శర్మ.. సిక్కింపై 155 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు. కాగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ సిద్ధమవుతున్నాడు. కొత్త సంవత్సరంలోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని ‘హిట్‌మ్యాన్’ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
రికార్డులతో నిండిన 2025
2025 సంవత్సరం రోహిత్ శర్మ కెరీర్‌లో మరపురాని ఏడాదిగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును విజేతగా నిలిపిన రోహిత్… అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ బ్యాటర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మూడో అత్యధిక వన్డే పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 352వ సిక్సర్ బాదడంతో అఫ్రిదీ (351)ని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో రోహిత్ ఖాతాలో 355 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు చేసిన రోహిత్.. సగటు 50.00, స్ట్రైక్‌రేట్ 100కు పైగా నమోదు చేశాడు. రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో 121 నాటౌట్ అతడి అత్యుత్తమ స్కోర్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా హిందూ క్రికెటర్.. అసలెవరీ లిట్టన్ దాస్?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!