Share News

వన్డే వరల్డ్ కప్ 2027 కోసం గిల్ మాస్టర్ ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి?

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:12 PM

వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

వన్డే వరల్డ్ కప్ 2027 కోసం గిల్ మాస్టర్ ప్లాన్.. కోహ్లీ, రోహిత్‌లకు విశ్రాంతి?
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జట్టు కూర్పుపై ప్రయోగాలు ప్రారంభించినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సమత్యులత కలిగిన జట్టును రూపొందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం గిల్ పలు విషయాలపై మాట్లాడాడు.


‘మా బౌలింగ్ విభాగంలో మొత్తం యువ ప్లేయర్లే ఉన్నారు. బ్యాటింగ్ మాత్రం సీనియర్లతో నిండి ఉంది. అందుకే ఇంగ్లండ్‌పై ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాం. 320 పరుగుల లక్ష్యం వచ్చినా దాన్ని ఛేదించే సామర్థ్యం మా బ్యాటింగ్‌కు ఉందనే విశ్వాసం ఉంది. మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకుని మ్యాచ్‌ను ముగించడం కెప్టెన్‌గా నాకు ఎంతో ధైర్యానిచ్చింది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ జట్టు కూర్పులను పరీక్షిస్తున్నాం. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సరైన లోతు ఉండే కాంబినేషన్ ఏదో తెలుసుకోవడానికి విభిన్న ప్రయోగాలు చేస్తున్నాం. భవిష్యత్తుకు ఉపయోగపడే జట్టును సిద్ధం చేయడమే మా లక్ష్యం. ఇంగ్లండ్‌లోని పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణాఫ్రికాను గుర్తు చేస్తున్నాయి. కొత్త బంతితో బ్యాటింగ్ అంత సులభం కాదు. అయితే తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కాంబినేషన్లను పరీక్షించగలిగితే ప్రపంచ కప్‌కు అది ఎంతో ఉపయోగపడుతుంది’ అని గిల్ వివరించాడు.


రోహిత్, కోహ్లీకి విశ్రాంతి?

తొలి వన్డేలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) ఆశించిన స్థాయిలో రాణించకపోయినా భారత్ విజయం సాధించింది. ఇదే సమయంలో 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లకు రొటేషన్ విధానం అమలు చేసే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కొన్ని మ్యాచ్‌ల్లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలపై చర్చ ప్రారంభమైంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.


ఇవి కూడా చదవండి:

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్

బీసీసీఐ ఇచ్చిన హామీ నెరవేరలేదు.. ర్యాన్ టెన్ జట్టును వీడటంపై కొత్త ప్రచారం!

Updated Date - Jul 15 , 2026 | 01:12 PM