Shubman Gill: అలా అయితే ప్రపంచ కప్‌లు ఎందుకు రావట్లేవు?.. మంజ్రేకర్‌పై గిల్ ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:44 PM
విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ విషయంపై మాట్లాడాడు. అతడిని ‘వన్డేలు నిజంగానే ఈజీ ఫార్మాటేనా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ తన 41వ టెస్టు శతకం బాదిన నేపథ్యంలో, ‘ఫ్యాబ్-4’లో భాగమైన కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పడాన్ని మంజ్రేకర్(Sanjay Manjrekar ) తప్పుబట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డేలను ‘సులువైన ఫార్మాట్’గా అభివర్ణిస్తూ, లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో వడోదరలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఈ విషయంపై మాట్లాడాడు. అతడిని ‘వన్డేలు నిజంగానే ఈజీ ఫార్మాటేనా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
‘ఏ ఫార్మాట్ కూడా ఈజీ కాదు. 2011 తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలవలేదు. వన్డేలు అంత ఈజీనే అయితే ప్రతి రెండో ఎడిషన్‌లో మనమే వరల్డ్ కప్ గెలిచేవాళ్లం కదా. అలా మాట్లాడటం ఎవరికైనా సులువైన పనే. కానీ ఏ ఫార్మాట్‌లో అయినా విజయం సాధించాలంటే అపారమైన సహనం, పట్టుదల, మానసిక దృఢత్వం అవసరం. ఐసీసీ టోర్నమెంట్లు గెలవాలంటే ఈ లక్షణాలే కీలకం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
మంజ్రేకర్ ఏమన్నాడంటే..?
‘వన్డే క్రికెట్ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు ఎందుకు ఈజీగా ఉంటుందో తెలుసుకోవాలంటే గత కొన్నేళ్లుగా భారత జట్టుకు ఆడుతున్న ప్లేయర్లను చూడాలి. వన్డేల్లో ఓపెనింగ్ చేసిన చాలా మంది బ్యాటర్లు టెస్టుల్లో మాత్రం మిడిల్ ఆర్డర్‌లో ఆడటానికే ఇష్టపడ్డారు. టెస్టుల్లో టాప్-3లో బ్యాటింగ్ చేయడానికి ఆలోచించేవారు. కానీ వన్డేల్లో మాత్రం టాప్ ఆర్డర్‌లో ఆడటానికి క్యూ కట్టేవారు. వన్డేల్లో ఓపెనర్‌గా లేదా నంబర్-3లో బ్యాటింగ్ చేస్తే కొన్ని లాభాలు ఉంటాయి. బౌలర్ కూడా ఔట్ చేయడం కంటే పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టి పెడతాడు. అందుకే టాప్ ఆర్డర్ బ్యాటర్లకు వన్డేలు ఈజీగా అనిపిస్తాయి’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?