Ind vs NZ: ఇషాన్ కిషన్ కాదు.. పంత్ స్థానంలో ఆడేది ఎవరంటే?
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:55 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్.. గాయంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కాగా అతడి స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న మొదలైంది. అయితే పంత్ స్థానంలో 24 ఏళ్ల యువ వికెట్‌కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
నెట్స్‌లో గాయపడ్డ పంత్..
ఆదివారం జరగనున్న తొలి వన్డేకు ముందు బీసీఏ బీ గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పంత్(Rishabh Pant) సుమారు 50 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అయితే త్రోడౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి నడుముపై భాగంలో తగలడంతో అతడికి తీవ్రమైన నొప్పి వచ్చింది. బంతి తగిలిన వెంటనే నొప్పితో మోకాళ్లపై కూలిపోయిన పంత్‌ను సపోర్ట్ స్టాఫ్ పరిశీలించి నెట్స్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ‘స్కాన్లు, వైద్య పరీక్షల్లో పంత్ కుడి వైపు రిబ్‌కేజ్‌కు గాయం అవ్వడంతో పాటు సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ధ్రువ్ జురెల్‌కు అవకాశం
పంత్ గైర్హాజరుతో అతడి స్థానంలో ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ(BCCI) అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున అద్భుత ఫామ్‌లో ఉన్న జురెల్ ఇప్పటికే భారత జట్టుతో చేరినట్లు బీసీసీఐ పేర్కొంది. పంత్ రీప్లేస్‌మెంట్ రేసులో ఇషాన్ కిషన్ పేరు వినిపించినప్పటికీ, సెలెక్టర్లు చివరకు జురెల్‌పైనే నమ్మకం ఉంచారు.
గత రెండేళ్లుగా భారత వన్డే జట్టులో భాగంగా ఉన్న పంత్, చివరిసారిగా 2024లో శ్రీలంక పర్యటనలో ఈ ఫార్మాట్‌లో ఆడాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు అతడిని జట్టు నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు వినిపించినా, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేసింది. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా ఇప్పుడు పంత్ తప్పుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?