వైభవ్‌ను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది: శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:54 AM
వైభవ్ సూర్యవంశీపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. మైదానం బయట ఎంతో ప్రశాంతంగా, సైలెంట్‌గా ఉండే వైభవ్.. గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం విధ్వంసకర బ్యాటర్‌గా మారిపోతాడని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. మైదానం బయట ఎంతో ప్రశాంతంగా, సైలెంట్‌గా ఉండే వైభవ్.. గ్రౌండ్‌లోకి దిగితే మాత్రం విధ్వంసకర బ్యాటర్‌గా మారిపోతాడని వెల్లడించాడు. ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌పై గెలిచి భారత్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైభవ్ గురించి అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘వైభవ్‌తో క్రికెట్ గురించి కాకుండా మైదానం బయట అతడి జీవితం గురించి ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తా. అందరూ అతడితో క్రికెట్ గురించే మాట్లాడుతుంటారు. కానీ అతడి కుటుంబం, జీవనశైలి, అతడికి ఏం ఇష్టం.. వంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా వైభవ్ తనను తాను మరింత స్వేచ్ఛగా వ్యక్తపరుచుకునే అవకాశం ఉంటుంది. వైభవ్ చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ మైదానంలోకి అడుగుపెట్టగానే అతడి ఆట పూర్తిగా మారిపోతుంది. అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు. అతడిని చూస్తే చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వ్యక్తిగతంగా వైభవ్ చాలా స్వీట్. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడు ఉండటం చాలా బాగుంటుంది’ అని అయ్యర్ వెల్లడించాడు.
వైభవ్‌కు కూడా టైమ్ వస్తుంది..
వైభవ్‌కు టీమిండియాలో ఉజ్వల భవిష్యత్తు ఉందని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ‘అతడికి కూడా సమయం వస్తుంది. ప్రస్తుతం మనకు ప్రపంచకప్ గెలిచిన ఓపెనర్లు ఉన్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైభవ్ ప్రస్తుతం జట్టులోని 15 మంది సభ్యుల్లో ఉన్నాడు. అతడికి అవకాశం వచ్చినప్పుడు భారత క్రికెట్‌ను శాసిస్తాడు’ అని శ్రేయస్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
పిల్లలతోనే రిలాక్సేషన్.. ఇంటికొచ్చాక రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే?
వన్డే ప్రపంచ కప్.. వచ్చే ఏడాది అత్యంత కీలకం: కేఎల్ రాహుల్