Share News

‘నగోయ’ నేర్పిన పాఠాలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:00 AM

గత హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 107. నగోయ వేదికగా జరిగిన ఈసారి ఆసియాడ్‌లో మరింతమెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా ఆ పతకాలను...

‘నగోయ’ నేర్పిన పాఠాలు

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

గత హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 107. నగోయ వేదికగా జరిగిన ఈసారి ఆసియాడ్‌లో మరింతమెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా ఆ పతకాలను పెంచుకోవాలని కేంద్ర క్రీడాశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. కానీ జరిగింది వేరు. 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాం. గత క్రీడల్లో కూడా మనకు నాలుగో స్థానమే లభించింది. కానీ పతకాల్లోనే భారీ అంతరం. అంతర్జాతీయ క్రీడారంగంలో 2036 నాటికి టాప్‌-10, 2047 నాటికి టాప్‌-5 ర్యాంక్‌కు చేరుకోవాలనేది భారత్‌ లక్ష్యం. అయితే క్రీడా పోటీలను అద్భుతంగా నిర్వహించడంకంటే.. ఆటల్లో కనబరస్తున్న పురోగతిని కొనసాగించడం కష్టమని ఈ ఆసియాడ్‌ గణాంకాలు స్పష్టంజేస్తున్నాయి. 169 స్వర్ణాలతో మొత్తం 341 పతకాలు నెగ్గిన చైనాకు ఏ దేశమూ దరిదాపుల్లో లేదు. 83 స్వర్ణాలు సహా 269 మెడల్స్‌తో ఆతిథ్య జపాన్‌ రెండోస్థానం దక్కించుకుంది. దక్షిణ కొరియా 150 పతకాల (39 స్వర్ణాలు)తో మూడో స్థానంలో నిలిచింది. నాలుగోస్థానంతో భారత్‌.. ఆసియా ఖండంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచింది. కానీ టాప్‌-3లో నిలిచిన దేశాల పతకాలకు మన మెడల్స్‌కు మధ్య తేడా భారీగా ఉంది. చివరి రెండ్రోజుల్లో 11 పసిడి పతకాలు వచ్చాయి కాబట్టి మనకు నాలుగో స్థానం లభించింది. లేదంటే టాప్‌-5 కూడా చేజారేదే.

8-sports.jpg

ఈ క్రీడాంశాల్లో ఇలా..: పతకాల వేటలో వెనుకంజలో నిలవడానికి ప్రధాన కారణం..మనకు ఎక్కువ మెడల్స్‌ తెచ్చిపెట్టే షూటింగ్‌, అథ్లెటిక్స్‌ క్రీడాంశాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడమే. ఈ రెండు విభాగాల్లోని క్రీడాకారులు హాంగ్జౌతో పోలిస్తే నిరాశపరిచారు. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ ఆటగాళ్ల దారుణ వైఫల్యం కూడా పతకాలపై ప్రభావం చూపింది.


స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయంతో క్రీడలకు ముందే వైదలగడం దెబ్బగా పరిణమించింది. తెలుగు అథ్లెట్‌ జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో హీట్‌ ప్రారంభానికి ముందు గాయంతో వైదొలగింది. గాయం నుంచి కోలుకొని పోటీపడ్డ అవినాష్‌ సబ్లే 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పతకం నెగ్గలేకపో యాడు. సింధు, లక్ష్య సేన్‌, సాత్విక్‌, చిరాగ్‌లాంటి స్టార్లు న్న బ్యాడ్మింటన్‌లో ఒక్క పతకమే దక్కింది. టీమ్‌ విభాగంలో లభించిన కాంస్యంతోనే మన షటర్లు సరిపెట్టుకున్నారు. టెన్నిస్‌లో ఒక్క పతకమూ దక్కక పోవడం 40ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా..ఆతిథ్య దేశంలో సన్నాహాలు సరిగా లేకపోవడమూ ఒకరకంగా అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపాయి. వసతి సమస్యలు, క్రీడా గ్రామం లేకపోవడం, సుదూరంలో ఉన్న వేదికలు, అక్కడికి చేరుకొనేందుకు ఆలస్యమైన బస్సులతో విశ్రాంతి సమయం తగ్గి క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. అయితే వీటిని పతకాలు సాధించలేకపోవడానికి పూర్తి కారణాలుగా చెప్పలేం. కానీ నగోయలో అథ్లెట్లకు మద్దతు ఇచ్చే వ్యవస్థలో లోటుపాట్లను బహిర్గతం చేశాయి. ఇక.. ఆర్చరీ, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, హాకీ, క్రికెట్‌ విభాగాలు అద్భుతంగా రాణించాయి. చెరో మూడు పతకాలు నెగ్గిన అథ్లెట్లు గుల్వీందర్‌, విత్యా రామరాజ్‌లతో పాటు గోల్ఫర్ల ప్రతిభను వేనోళ్లా కొనియాడాల్సిందే. ఏదేమైనా..సమస్యలు ఎదురైనా భారత క్రీడా పునాది విస్తరిస్తోందని నగోయా ఆసియాడ్‌ నిరూపించింది.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 06:00 AM