వన్డే ప్రపంచ కప్.. వచ్చే ఏడాది అత్యంత కీలకం: కేఎల్ రాహుల్
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:29 PM
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 129 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆడిన నాక్‌పై రాహుల్ స్పందించాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రణాళికలను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 129 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ టీమిండియాపై వెస్టిండీస్ విజయం సాధించింది. అయితే తాను ఆడిన నాక్‌పై కేఎల్ రాహుల్ స్పందించాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రణాళికలను వెల్లడించాడు.
‘129 పరుగులు చేయడం ఆనందంగా అనిపించింది. కానీ సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఆ సంతోషం ఇంకా ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ క్రీజులో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనుకున్నా. మిడిలార్డర్‌లో చివరి సారిగా జనవరిలో న్యూజిలాండ్‌పై సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశా. ఆ తర్వాత పెద్దగా అవకాశం రాలేదు. 2027లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మ్యాచ్‌ల్లో ఎక్కువ సమయం క్రీజులో గడపడం ద్వారా.. బయట చేస్తున్న ప్రాక్టీస్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. ఏడేళ్లుగా నేను మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్ చేస్తున్నా. చివరి 10 ఓవర్లలో 80-90 పరుగులు చేయడం అంత సులభం కాదు. పాత బంతి రివర్స్ అవుతోంది’ అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
సిక్సర్లు కొట్టడంపై ఫోకస్..
‘నేను ఎప్పుడూ టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేశా. కొత్త బంతి వేగంగా బ్యాట్‌పైకి రావడం నాకు ఇష్టం. ఆ వేగాన్ని ఉపయోగించుకోగలను. కానీ ఇప్పుడు సాఫ్ట్, పాత బంతితో ఆడటం, దానితోనూ సిక్సర్లు కొట్టడం నేర్చుకుంటున్నా. నా ఆటలో నిరంతరం మెరుగుపడాలని చూస్తున్నా. ఐదో, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు జట్టుకు స్థిరంగా పరుగులు అందించాలంటే ఏం చేయాలో అర్థం చేసుకుంటున్నా. 2027 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ప్రతి సిరీస్‌ను ప్రయోగాలకు ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీంతో మాకు ఎక్కువ సమయం క్రీజులో గడిపే అవకాశం లభిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 330-340 పరుగులు చేయగలమా అనేది ఇప్పటివరకు మా లక్ష్యం. కానీ ఇప్పుడు 340, 350 పరుగులను కూడా వన్డేల్లో సులభంగా ఛేదిస్తున్నారు. కాబట్టి సెట్ అయిన బ్యాటర్లు 370, 380 పరుగుల వరకు స్కోరును తీసుకెళ్లడం.. అవసరమైతే 400 పరుగులు చేయడం ఎలా అనేది ఆలోచించాలి’ అని రాహుల్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
జమ్ము కశ్మీర్‌పై ఘన విజయం.. రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌దే ఇరానీ కప్
వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్