ఘనంగా ఆసియా క్రీడల ముగింపు వేడుకలు.. 21 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్!
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:26 PM
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు-2026కు తెరపడింది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభమైన 20వ ఆసియా క్రీడలు.. ఆదివారం ముగిశాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు-2026కు తెరపడింది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభమైన 20వ ఆసియా క్రీడలు.. ఆదివారం ముగిశాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడు షేక్ జోయాన్ బిన్ హమద్ అల్ థానీ క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వన్ ఏషియా’ థీమ్‌తో ముగింపు వేడుకలు నిర్వహించారు. 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఖతార్‌లోని దోహాకు బ్యాటన్‌ను అప్పగించారు.

భారత్‌కు నాలుగో స్థానం
ఈ ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 85 పతకాలు సాధించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఆసియా క్రీడల్లో 106 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 85 పతకాలకే పరిమితమైంది. అయితే గత క్రీడల్లోనూ భారత్ నాలుగో స్థానంలోనే నిలిచింది. చైనా 341 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఏకంగా 169 స్వర్ణాలు ఉన్నాయి. జపాన్ 269 పతకాలతో రెండో స్థానంలో ఉండగా.. దక్షిణ కొరియా 150 పతకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
భారత్ తరఫున నీరూ దండా..

ముగింపు వేడుకల్లో భారత్ తరఫున షూటర్ నీరూ దండా పతాకధారిగా వ్యవహరించింది. అయిచి-నగోయా క్రీడల్లో ఆమె రెండు స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సాధించి భారత తరఫున ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో దాదాపు 17 వేల మంది క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 469 స్వర్ణ పతకాల ఈవెంట్లు నిర్వహించారు. టోక్యో నుంచి ఒసాకా వరకు పలు ప్రాంతాల్లో పోటీలు జరిగాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పాడెల్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, టెక్‌బాల్, సర్ఫింగ్ వంటి క్రీడలు తొలిసారిగా ఆసియా క్రీడల్లో చోటు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
జమ్ము కశ్మీర్‌పై ఘన విజయం.. రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌దే ఇరానీ కప్
వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్