Share News

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:25 PM

బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (KRG) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?
Shah Rukh Khan

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (KRG) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో కొత్త జట్లు చేరితే.. అందులో ఓ జట్టును కొనుగోలు చేసేందుకు KRG మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని సమాచారం.


ప్రస్తుతం ది హండ్రెడ్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. గతేడాది ఈ ఎనిమిది ఫ్రాంచైజీల్లో వాటాల విక్రయానికి జరిగిన బిడ్డింగ్‌లో KRG కూడా పాల్గొంది. షారుక్ ఖాన్ సహ యాజమాన్యంలో ఉన్న KRG.. ట్రెంట్ రాకెట్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే చివరకు KRG బిడ్డింగ్ నుంచి తప్పుకుంది. ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీ విలువ కొంత ఎక్కువగా ఉందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం చెల్సియా సహ యజమాని టాడ్ బోహ్లీ, బ్రిటిష్ వ్యాపారవేత్త జొనాథన్ గోల్డ్‌స్టీన్ నేతృత్వంలోని కన్సార్టియం.. ట్రెంట్ రాకెట్స్‌లో 49 శాతం వాటాను 40 మిలియన్ పౌండ్ల కంటే తక్కువ మొత్తానికి కొనుగోలు చేసింది.


10 జట్లకు విస్తరిస్తే.. KRG మళ్లీ రంగంలోకి?

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) భవిష్యత్‌లో ది హండ్రెడ్‌ను 8 జట్ల నుంచి 10 జట్లకు విస్తరించాలని నిర్ణయిస్తే.. KRG మరోసారి బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అయితే 2028 వరకు ప్రస్తుత మీడియా హక్కుల ఒప్పందం కొనసాగనుండటంతో.. అంతకుముందు కొత్త జట్లను చేర్చే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది. కొత్తగా రెండు జట్లు వస్తే డర్హామ్‌తో పాటు బ్రిస్టల్ లేదా టాంటన్ కేంద్రంగా మరో జట్టును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొత్త జట్ల చేరికతో ది హండ్రెడ్ మీడియా హక్కుల విలువ కూడా పెరిగే అవకాశం ఉంది.


ప్రపంచవ్యాప్తంగా నైట్ రైడర్స్ సామ్రాజ్యం

నైట్ రైడర్స్ గ్రూప్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ప్రముఖ స్పోర్ట్స్ గ్రూప్‌గా ఎదిగింది. భారత్‌తో పాటు వెస్టిండీస్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా KRG ఫ్రాంచైజీలను కలిగి ఉంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మొదలైన నైట్ రైడర్స్ బ్రాండ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ తదితర టోర్నీల్లోనూ తన పరిధిని విస్తరించింది. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించిన తొలి గ్లోబల్ క్రికెట్ బ్రాండ్‌గా కూడా KRG ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ‘నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్’ ఈ ఏడాది ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ది హండ్రెడ్‌లోకి KRG ఎంట్రీపై అధికారిక ప్రకటన లేకపోయినా.. లీగ్‌ను 10 జట్లకు విస్తరించే నిర్ణయం తీసుకుంటే షారుక్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ మరోసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

Updated Date - Aug 18 , 2026 | 06:51 PM