Share News

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:38 PM

భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.

అరుదైన ఘనత.. రాహుల్ ద్రవిడ్ సరసన దేవదత్ పడిక్కల్
Devdutt Padikkal

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పడిక్కల్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో అతడు భారత్ తరఫున మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ.. స్వదేశం వెలుపల ఒక టెస్టు మ్యాచ్‌లో 200 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన జాబితాలో పడిక్కల్ కంటే ముందు టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్ మాత్రమే ఉన్నారు. ద్రవిడ్ ఏకంగా ఐదు సార్లు ఈ ఘనత సాధించగా.. మంజ్రేకర్ ఒకసారి 200 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత జట్టులో మూడో నంబర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన చతేశ్వర్ పుజారా కూడా ఈ ఘనతను సాధించలేకపోయాడు.


మూడో టెస్టులోనే..

శ్రీలంకతో తొలి టెస్టులో సాయి సుదర్శన్‌కు బ్యాకప్‌గా పడిక్కల్‌ను ఎంపిక చేశారు. అయితే సాయి సుదర్శన్ చేతి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవడంతో పడిక్కల్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. ఇది అతడికి కేవలం మూడో టెస్ట్ మ్యాచ్. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లోనే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. తన కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేయడమే కాకుండా.. ఏకంగా 167 పరుగుల భారీ సెంచరీ చేశాడు.


రెండో ఇన్నింగ్స్‌లోనూ..

రెండో ఇన్నింగ్స్‌లోనూ పడిక్కల్ జోరు కొనసాగించాడు. క్రీజులో కుదురుగా కనిపించిన కర్ణాటక బ్యాటర్ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించాడు. చివరకు కేశర నువాంత బౌలింగ్‌లో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడి స్కోరు 211 పరుగులకు చేరింది. ఈ క్రమంలోనే విదేశీ గడ్డపై ఒక టెస్టులో 200 పరుగులు సాధించిన భారత మూడో నంబర్ బ్యాటర్ల అరుదైన జాబితాలో పడిక్కల్ చోటు సంపాదించాడు.


ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!

Updated Date - Aug 18 , 2026 | 05:39 PM