ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ సాయం తీసుకోవాలి.. సంజూకి సంజయ్ మంజ్రేకర్ సలహా
ABN , Publish Date - May 06 , 2026 | 03:05 PM
ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను సీఎస్కే చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. సంజు ఆటతీరుపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఆరంభంలో వరుసగా పరాభవాలు చవి చూసిన చెన్నై సూపర్ కింగ్స్.. క్రమంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను సీఎస్కే చిత్తుగా ఓడించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదేసిన సంజు.. ఢిల్లీపై 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజు క్రీజులో ఉంటే సీఎస్కేకి ఓటమి ఉండదంటూ సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. సంజు ఆటతీరుపై స్పందించాడు. అతడికి పలు కీలక సూచనలు చేశాడు.
‘సంజు శాంసన్.. చెన్నై విజయాల్లో ముఖ్య పాత్ర అతడిదే. ఇప్పటికే కెరీర్‌లో కీలక దశలో ఉన్నాడు. అతడు దీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగాలంటే ప్రతిభతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫిట్‌నెస్ విషయంలో సంజు.. కోహ్లీ సాయం తీసుకోవాలి. 37 ఏళ్ల వయసులోనూ కోహ్లీ.. చాలా ఫిట్‌గా ఉన్నాడు. అదే దూకుడును ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. బరిలోకి దిగాడంటే పరుగుల వేటను ఆపడు. తన సుదీర్ఘ కెరీర్‌లో కోహ్లీ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. సంజు కూడా క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగాలంటే కోహ్లీ సాయం తీసుకోవాలి. ఫిట్‌నెస్ సీక్రెట్‌ను అడిగి తెలుసుకోవాలి. ప్రతిభ ఎంత ఉన్నా.. ఆటకు శరీరం సహకరించాలి. సంజు వికెట్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 20 ఓవర్లు కీపింగ్ చేస్తూ.. బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంటుంది. ఇందుకు ఫిట్‌నెస్ కీలకం’ అని సంజుకి సంజయ్ మంజ్రేకర్ సలహా ఇచ్చాడు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సంజు శాంసన్ 10 మ్యాచ్‌లు ఆడి 402 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ 9 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఢిల్లీపై విజయంతో ఐదు మ్యాచ్‌లు గెలిచిన సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?
సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!