సంజు అద్భుత ఇన్నింగ్స్.. గావస్కర్ ఫిదా!
ABN , Publish Date - May 06 , 2026 | 10:43 AM
ఐపీఎల్ 2026లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో నిన్న(మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. తన ఆట తీరుతో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని చాటిచెప్పాడు. సంజు ఆట తీరుకు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఫిదా అయ్యాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఒకానొక దశలో 22 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. అయితే క్రీజులో కుదురుకున్నాక ఒక్కసారిగా గేర్ మార్చి 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్ల మీద సంజు చేసిన మెరుపు దాడి మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
ఈ మ్యాచ్‌లో అందరినీ ఆకట్టుకున్న అంశం సంజు శాంసన్ నిస్వార్థ గుణం. ఈ సీజన్లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన సంజుకు.. మరో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాని కోసం ప్రయత్నించలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు శాంసన్ హర్షా భోగ్లేతో మాట్లాడుతూ.. ' నాకు సెంచరీ ముఖ్యం కాదు.. జట్టును గెలిపించడమే నా మొదటి ప్రాధాన్యత' అని స్పష్టం చేశాడు. సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.
'సహనం అనేది ఎప్పుడూ గొప్ప ఫలితాలను ఇస్తుంది. కార్తీక్ శర్మ వేగంగా మ్యాచ్ ముగించకపోయి ఉంటే సంజుకు కచ్చితంగా సెంచరీ వచ్చేది. కానీ శాంసన్ జట్టు కోసమే ఆడాడు' అని గావస్కర్ విశ్లేషించారు. మొత్తంగా ధోనీ లేకపోయినా సంజు రూపంలో ఓ నమ్మదగ్గ బ్యాటర్ దొరికాడని సీఎస్కే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ
ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!