సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
ABN , Publish Date - May 06 , 2026 | 01:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సంజు శాంసన్ 87 పరుగులతో సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్‌పై గైక్వాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ..'సంజు వంటి నిలకడైన ఆటగాడు జట్టులో ఉండటం మా అదృష్టం. అతడు జట్టుకు వెన్నెముక వంటివాడు. వరల్డ్ కప్ 2026లో చూపించిన అద్భుత ప్రదర్శనను ఇక్కడ కూడా కొనసాగించడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదిన సంజు.. ఈ కఠినమైన పిచ్‌పై 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలవడం సంతోషంగా ఉంది. ఓపెనర్లు త్వరగా ఔట్ అయినప్పటికీ సంజు ఉన్నాడనే భరోసా మ్యాచ్‌ను గెలిపించింది' అని రుతురాజ్ ప్రశంసించాడు.
నిన్న మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌పై స్పందిస్తూ.. బ్యాటింగ్‌కు ఇది ఏమాత్రం అనుకూలంగా లేదని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ జట్టు ప్రారంభంలోనే 5 వికెట్లు కోల్పోయినా రిజ్వీ, స్టబ్స్ పోరాడి 155 పరుగులు చేయడం అద్భుతమన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మరింత స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో సీఎస్కే బౌలర్లు సక్సెస్ అయ్యారని ప్రశంసించాడు. జట్టు సమష్టిగా రాణించడం వల్లే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగామని రుతురాజ్ పేర్కొన్నాడు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, తాను సీజన్ ప్రారంభం నుంచే సానుకూల దృక్పథంతో ఉన్నామని, ఇప్పుడు జట్టు మొత్తం ఒకే తాటిపైకి వచ్చి రాణించడం సంతోషంగా ఉందని రుతురాజ్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
కష్టపడి పతకం గెలిచినా.. కనీస గుర్తింపు లేదు: స్టార్ షట్లర్ అసహనం
నితీశ్ రాణా ఔట్‌పై సోషల్ మీడియాలో వార్.. అసలేం జరిగిదంటే.?